RS Praveen Kumar: ఆరు గ్యారెంటీల మాదిరిగానే కాంగ్రెస్ బీసీలను మోసం చేసే అవకాశం ఉంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించారన్న ఆర్ఎస్
- బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానంతోనే సరిపెట్టిందని విమర్శ
- సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల మాదిరిగానే బీసీలను కూడా మోసం చేసే అవకాశముందని, కాబట్టి తెలంగాణలోని బీసీలు అందరూ అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను సిద్ధరామయ్య సాక్షిగా కాంగ్రెస్ నాయకులు ప్రకటించారని గుర్తు చేశారు. కానీ మోసం చేసే అవకాశం ఉందన్నారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ కులగణన చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అసెంబ్లీ తీర్మానంతోనే సరిపెట్టిందని విమర్శించారు. బీసీ కమిషన్ ఇప్పటి వరకు ఈ విషయంలో ఏం చేసిందో ఎవరికీ తెలియదన్నారు. బీసీ సబ్ ప్లాన్ జాడ కూడా లేదన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టపరమైన అడ్డంకులు పెద్దగా ఏమీ లేవని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణలో బీసీల వాటా 54 శాతమని తేలిందన్నారు. దాని ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేయాలన్నారు. చట్టం కావాలంటే తర్వాత తీసుకు రావొచ్చునని తెలిపారు. మళ్లీ సమయం లేదంటూ బుకాయిస్తూ పాత 23 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరిపి బీసీలను మోసం చేయాలని చూస్తే ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకులారా అని హెచ్చరించారు.