Daggubati Purandeswari: ఎన్డీయే కూటమికి మోదీ కొత్త నిర్వచనం పలికారు: పురందేశ్వరి
- ఢిల్లీలో నేడు ఎన్డీయే సమావేశం
- మోదీ నిర్దేశించిన మేరకు ఎన్డీయే కూటమి కృషి చేస్తుందన్న పురందేశ్వరి
- మధ్య తరగతి వారికి కూడా సంక్షేమం అందజేస్తామని వెల్లడి
ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న అనంతరం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే కూటమికి నరేంద్ర మోదీ ఒక సరికొత్త నిర్వచనం పలికారని తెలిపారు.
ఎన్ అంటే న్యూ ఇండియా (New India), డి అంటూ డెవలప్డ్ ఇండియా (Developed India), ఏ అంటే యాస్పిరేషనల్ ఇండియా (Aspirational India) అని వివరించారు. మోదీ నిర్వచించిన మేరకు, నిర్దేశిత లక్ష్యసాధన దిశగా ఎన్డీయే కూటమి తరఫున సంపూర్ణ అంకితభావంతో రాబోయే ఐదేళ్ల పాటు కృషి చేస్తామని చెప్పారు.
నరేంద్ర మోదీ ఈ ఐదేళ్లు మాత్రమే కాకుండా, తదుపరి ఐదేళ్లు కూడా ప్రజలు ఎన్డీయే కూటమిని ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో ఉన్నారని పురందేశ్వరి వెల్లడించారు.
పేదలు మాత్రమే కాకుండా, మధ్యతరగతి ప్రజల కలలైన సొంత ఇల్లు, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై ఈసారి ఎన్డీయే ప్రభుత్వం దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. మధ్యతరగతి వర్గాల సంక్షేమం కూడా తమ ప్రభుత్వ ప్రాధాన్యత అంశమని తెలిపారు.