Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ వుండాలి: కాంగ్రెస్ సీనియర్ల డిమాండ్

Congress seniors DK Shivakumar and Shashi Tharoor demand for Rahul Gandhi as Parliament to get Leader of Opposition
  • కాంగ్రెస్ సీనియర్లు డీకే శివకుమార్, శశి థరూర్ డిమాండ్
  • లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విస్తృతంగా ప్రచారం చేశారన్న నేతలు
  • కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు అర్హత సాధించక పోవడంతో పదేళ్లుగా ఖాళీగా ఉన్న ప్రతిపక్ష నేత పదవి
పదేళ్ల పాటు ఖాళీగా ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత పదవిని ఈసారి రాహుల్ గాంధీకి అప్పగించాలని ఆ పార్టీ సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం రాహుల్ గాంధీ పోషించిన పాత్రపై ఇరువురూ ప్రశంసల జల్లు కురిపించారు. 

శశిథరూర్ మాట్లాడుతూ.. ‘‘ రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీకి కూడా లోక్‌సభలో ఇవే బాధ్యతలు అప్పగించడం సముచితం. ఈ మేరకు నా అభిప్రాయాన్ని బహిరంగంగా, ప్రైవేటుగానూ తెలియజేశాను’’ అని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రాహుల్ గాంధీకే దక్కుతుందని పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా పార్టీలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడే ఉండాలని అన్నారు. ఈ మేరకు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.

ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా నిలబెట్టాలని అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఆయన ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. బెంగళూరులోని కాంగ్రెస్ భవన్‌లో రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశం అనంతరం డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పదేళ్లుగా ఖాళీగా ఉన్న ప్రతిపక్ష నేత పదవి..
లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవి గత పదేళ్లుగా ఖాళీగా ఉంది. ‘1977 ప్రతిపక్ష నాయకుడి జీత, భత్యాల చట్టం’ ప్రతిపక్ష నాయకుడిగా అధికారికంగా గుర్తిస్తుంది. సభలో కనీసం 10 శాతం సీట్లు కలిగివున్న అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిని ఈ పదవి కోసం ఎంపిక చేయవచ్చు. 16వ, 17వ లోక్‌సభల్లో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలేవీ అర్హత సాధించలేకపోయాయి. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ 10 శాతానికి పైగా సీట్లు దక్కించుకుంది. దీంతో రాహుల్ గాంధీని ఆ స్థానంలో కూర్చోబెట్టాలని పార్టీ సీనియర్లు యోచిస్తున్నారు.
Rahul Gandhi
Congress
Lok Sabha
Lok Sabha Polls

More Telugu News