Vishal Dadlani: కంగనపై చేయిచేసుకున్న మహిళా కానిస్టేబుల్‌కు జాబ్ ఇస్తా: బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్

Vishal Dadlani promises job to CISF constable who slapped Kangana Ranaut
  • ఢిల్లీలో రైతు నిరసనలపై కంగన వ్యాఖ్యలకు మహిళా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆగ్రహం
  • చండీగఢ్ ఎయిర్ పోర్టులో కంగన చెంప ఛెళ్లుమనిపించిన వైనం
  • కానిస్టేబుల్‌పై వెంటనే సస్పెన్షన్ వేటు వేసిన సీఐఎస్ఎఫ్
  • మహిళా కానిస్టేబుల్‌కు కొత్త జాబ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్న మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చెంపఛెళ్లుమనిపించి సస్పెన్షన్‌కు గురైన సీఐఎస్ఎఫ్ మహిళ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌కు ప్రముఖ బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ అండగా నిలిచారు. ఆమెకు మరో జాబ్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. 

‘‘నేను హింసను ఎప్పుడూ ఆమోదించను. కానీ మహిళా కానిస్టేబుల్ చర్యను అర్థం చేసుకోగలను. సీఐఎస్‌ఎఫ్ ఆమెపై ఎటువంటి చర్య అయినా తీసుకుంటే నేను ఆమెకు మరో జాబ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్’’ అని ఇన్‌స్టాలో వ్యాఖ్యానించారు. 

పంజాబ్ రైతుల నిరసనలపై కంగన వ్యాఖ్యలకు భగ్గుమన్న కుల్వీందర్ కౌర్ ఎంపీపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. చండీగఢ్ ఎయిర్‌పోర్టులో జూన్ 6న ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ చెక్ తరువాత బోర్డింగ్ పాయింట్ వైపు వెళ్లబోతున్న కంగనపై మహిళా కానిస్టేబుల్ చేయిచేసుకున్నారు. ఘటన వెలుగులోకి రావడంతో సీఐఎస్‌ఎఫ్ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు, ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వెంటనే కంగనా రనౌత్ మహిళా కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేశారు. ‘‘రైతులు రూ.100 తీసుకుని నిరసనల్లో పాల్గొన్నారని కంగన అన్నారు. ఆమె ఇలా ఎలా అనగలిగారు. ఆ నిరసనల్లో మా అమ్మ కూడా పాల్గొంది’’ అని కుల్విందర్ కౌర్ మీడియాతో అన్నారు. 

హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్ ఘన విజయం సాధించారు. త్వరలో ఆమె డైరెక్టర్‌గా ఓ సినిమా చేయబోతున్నారు. తన సొంత బ్యానర్ మణికర్ణికా ఫిలిమ్స్‌పై ఎమర్జెన్సీ పేరిట ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు.
Vishal Dadlani
Kulwinder Kaur
Kangana Ranaut
Farmer Protests

More Telugu News