Narendra Modi: రామోజీరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం
- రామోజీరావు మృతి చాలా బాధాకరమన్న ప్రధాని
- భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన దార్శనికుడని కితాబు
- మీడియా, వినోద ప్రపంచంలో ఆయన చెరగని ముద్ర వేశారంటూ వ్యాఖ్య
మీడియా మొఘల్ రామోజీరావు మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా రామోజీ మృతిపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "రామోజీరావు మృతి చాలా బాధాకరం. ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన దార్శనికుడు. ఆయన గొప్ప రచనలు జర్నలిజం, చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయి. మీడియా, వినోద ప్రపంచంలో ఆవిష్కరణ మరియు శ్రేష్ఠత కోసం కొత్త ప్రమాణాలను నెలకొల్పారు.
రామోజీరావు భారతదేశ అభివృద్ధి పట్ల ఎంతో మక్కువ చూపేవారు. పలు సందర్భాల్లో ఆయనతో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం లభించడం నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.