Amit Shah: రాజీనామాకు సిద్ధమైన మహారాష్ట్ర డిప్యుటీ సీఎం ఫడ్నవీస్.. వారించిన అమిత్ షా

Amit Shah Rejects Devendra Fadnaviss Offer To Resign Asks Him To Continue
  • మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమికి భారీ షాక్
  • ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాకు సిద్ధమైన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్
  • ఫడ్నవీస్ రాజీనామా ప్రతిపాదనను తిరస్కరించిన షా
  • ఆయన రాజీనామాతో బీజేపీ కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని వారించిన షా
సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అధికార మహాయుతి కూటమికి భారీ షాక్ ఇచ్చింది. డిప్యుటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బీజేపీ, ఎక్‌నాథ్ శిండే వర్గం, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కూటమికి ఈ ఎన్నికల్లో కేవలం 17 సీట్లు దక్కగా కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎస్పీపీ (శరత్‌చంద్రపవార్) పార్టీలతో కూడిన ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ 30 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 48 స్థానాలకు ఏకంగా 40 స్థానాలు దక్కాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమవగా హోం మంత్రి అమిత్ షా వారించినట్టు తెలుస్తోంది. ఆయన రాజీనామా ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు సమాచారం. దేవేంద్ర ఫడ్నవీస్ తో స్వయంగా మాట్లాడిన అమిత్ షా రాజీనామా ఆలోచనను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారట. 

శుక్రవారం నాటి ఎన్డీయే సమావేశం తరువాత బీజేపీ నేతలు పలువురు సీఎం ఏక్‌నాథ్ శిండేతో పాటు మరో డిప్యుటీ సీఎం అజిత్ పవార్‌తో భేటీ అయ్యారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఫలితాలు రావడంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తాను రాజీనామాకు సిద్ధమని దేవేండ్ర ఫడ్నవీస్ పేర్కొన్నట్టు సమాచారం. ఆ తరువాత ఫడ్నవీస్.. హోం మంత్రిని ఆయన నివాసంలో కలిశారట. ఈ సందర్భంగా అమిత్ షా మరోసారి ఫడ్నవీస్ రాజీనామా ప్రతిపాదనను తిరస్కరించడమే కాకుండా రాష్ట్రంలో బీజేపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని కూడా దిశానిర్దేశం చేశారట. 

‘‘మీరు రిజైన్ చేస్తే బీజేపీ శ్రేణుల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి రాజీనామా చేయొద్దు’’ అని షా స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రధాని ప్రమాణ స్వీకారం తరువాత ఈ విషయమై మరింత కూలంకషంగా చర్చిద్దామని కూడా షా చెప్పినట్టు తెలిసింది. మరో నాలుగు నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ..ఈ ఓటమి నుంచి ఎలా తేరుకుంటుందనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Amit Shah
Devendra Fadnavis
Maharashtra
Maha Vikas Aghadi
Mahayuti
Lok Sabha Polls

More Telugu News