Narendra Modi: మోదీకి పాకిస్థాన్ ఎందుకు అభినందనలు చెప్పలేదు?.. పాక్ విదేశాంగ శాఖ సమాధానం ఇదే!

it is the right of the people of India to decide about their own leadership says Pakistan On Narendra modi Elect

  • భారత్‌తో సంబంధాల విషయంలో సవాళ్లు ఉన్నప్పటికీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామన్న పాక్
  • మోదీ ఇంకా ప్రమాణస్వీకారం చేయనందున అభినందనలు చెప్పలేదన్న ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి
  • రేపు భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోయినప్పటికీ.. ఎన్డీయే పక్షనేతగా ఎన్నికైన మోదీ రేపు (ఆదివారం) భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మొత్తం 50కి పైగా దేశాల నాయకులు నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరచుకుందామంటూ తమ ఆకాంక్షలు తెలిపారు. కానీ పొరుగుదేశం పాకిస్థాన్ మాత్రం మోదీకి అభినందనలు తెలపలేదు. ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఈ పరిణామం ఇరు దేశాల బంధాలను ఏవిధంగా ప్రభావితం చేయనుందనే ఆసక్తికర చర్చలు కూడా తెరపైకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్‌ సహా అన్ని పొరుగు దేశాలతో సహకార సంబంధాలను కోరుకుంటున్నట్లు ఆ దేశ విదేశాంగ కార్యాలయం శుక్రవారం వ్యాఖ్యానించింది. ఇరుదేశాల మధ్య శతాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న జమ్మూకశ్మీర్ వివాదం సహా అన్ని సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మక చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నట్టు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ముంతాజ్ బలోచ్ చెప్పారని ‘డాన్’ పత్రిక పేర్కొంది.

మోదీకి ఎందుకు అభినందనలు చెప్పలేదు?
భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోదీకి ఇప్పటివరకు ఎందుకు అభినందనలు తెలియజేయలేదని ప్రశ్నించగా, ముంతాజ్ బలోచ్ దాటవేత ధోరణి ప్రదర్శించారు. తమ నాయకత్వాన్ని నిర్ణయించుకోవడం భారత ప్రజల హక్కు అని ఆయన వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడానికి పాకిస్థాన్ వ్యతిరేకమని, ఇటీవలి ఎన్నికలలో పాకిస్థాన్‌పై రాజకీయపరమైన ఆరోపణలు చేశారని బలోచ్ ప్రస్తావించారు. 

భారత్‌తో సంబంధాల విషయంలో సవాళ్లు ఉన్నప్పటికీ పాకిస్థాన్ బాధ్యతాయుతంగా స్పందించాలని నిర్ణయించుకుందని బలోచ్ పేర్కొన్నారు. ఇంకా కొత్త ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయకపోవడంతో మోదీకి అభినందనలు చెప్పలేదని పేర్కొన్నారు. కాగా రేపు (ఆదివారం) భారత్‌కు మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News