KTR: విలువలతో కూడిన జర్నలిజానికి రామోజీరావు చిహ్నంగా నిలిచిపోతారు: కేటీఆర్
- తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం తపనపడేవారన్న కేటీఆర్
- రామోజీరావు ఒక వ్యక్తి కాదని, శక్తిమంతమైన వ్యవస్థ అన్న బీఆర్ఎస్ నేత
- రామోజీరావు మరణం దుఃఖాన్ని కలిగించిందన్న బండారు దత్తాత్రేయ
విలువలతో కూడిన జర్నలిజానికి రామోజీరావు చిహ్నంగా చిరకాలం నిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు పత్రికారంగం, ప్రసారమాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకు వచ్చారన్నారు. తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం తపనపడేవారన్నారు.
దేశం, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తి రామోజీరావు అన్నారు. భవిష్యత్తు గొప్పగా ఎలా ఉండాలో కలిసినప్పుడల్లా చెప్పేవారన్నారు. ఆయన ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియాలా మాట్లాడేవారని... ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తీరని లోటు అన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు ఎప్పుడూ స్ఫూర్తిని ఇస్తాయన్నారు.
రామోజీరావు ఒక వ్యక్తి కాదు... శక్తిమంతమైన వ్యవస్థ: వెంకయ్య నాయుడు
రామోజీరావు ఒక వ్యక్తి కాదని... శక్తిమంతమైన వ్యవస్థ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఒక అఖండ జ్యోతి ఆరిపోయిందన్నారు. ఆయన స్వయంకృషితో కష్టపడి అన్ని రంగాల్లో విజయం సాధించారని పేర్కొన్నారు. ఒక ధ్రువతారలా నిరంతరం వెలుగుతూ ఉంటారన్నారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆయనతో మాట్లాడటం వల్ల ఎంతో పరిపక్వత సాధించినట్లు చెప్పారు. ఆయన ఒక పోరాట యోధుడు... అనుకున్న విజయాలు సాధించారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దుఃఖాన్ని కలిగించింది: బండారు దత్తాత్రేయ
రామోజీరావు మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించిందని బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన గొప్ప వ్యక్తి మాత్రమే కాదు... శక్తి కూడా అన్నారు. ఆయన మితభాషి... సామాజిక మార్పునకు ఆయన చేసిన కృషి చాలా గొప్పదన్నారు. తెలుగు భాష, సాహిత్యాభివృద్ధికి ఈనాడు, ఈటీవీల ద్వారా ఎంతో కృషి చేశారన్నారు. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడ్డారన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. తాను ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానన్నారు.