Kangana Ranaut: కంగన చెంపపై కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కు కానుకగా బంగారు ఉంగరం

TPDK will send a gold ring to CISF constable who slapped Kangana in airport
  • ఇటీవల చండీగఢ్ లో కంగన చెంపపై కొట్టిన మహిళా కానిస్టేబుల్ 
  • దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వైనం
  • కుల్వీందర్ కౌర్ కు మద్దతు పలికిన టీపీడీకే పార్టీ
  • 8 గ్రాముల బంగారు ఉంగరం పంపుతామని వెల్లడి
ఇటీవల చండీగఢ్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చెంపపై కొట్టడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. గతంలో కంగనా రైతులపై చేసిన అవమానకర వ్యాఖ్యలకు బదులు తీర్చుకునేందుకే తాను ఆమె చెంపపై కొట్టానని ఆ కానిస్టేబుల్ వెల్లడించింది. కంగనా ఫిర్యాదు నేపథ్యంలో, కుల్వీందర్ ను సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. 

అయితే, కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ కు రైతు సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తమిళనాడులోని తంతై పెరియార్ ద్రవిడర్ కళగం (టీపీడీకే) పార్టీ కుల్వీందర్ కౌర్ కు ఓ బంగారు ఉంగరాన్ని కానుకగా పంపాలని నిర్ణయించింది. ఆ ఉంగరంపై పెరియార్ ముఖచిత్రం ముద్రించి పంపిస్తామని టీపీడీకే ప్రధాన కార్యదర్శి రామకృష్ణన్ వెల్లడించారు. ఈ బంగారు ఉంగరం బరువు 8 గ్రాములు ఉంటుందని తెలిపారు. 

సోమవారం నాడు కుల్వీందర్ కౌర్ చిరునామాకు ఉంగరాన్ని కొరియర్ సర్వీస్ ద్వారా పంపుతామని, ఒకవేళ బంగారు ఉంగరం కొరియర్ లో పంపేందుకు అనుమతి లేకపోతే, తమ పార్టీ సభ్యుల్లో ఒకరిని విమానంలో కానీ, రైల్లో కానీ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ స్వస్థలానికి పంపించి బంగారు ఉంగరంతో పాటు, పెరియార్ గురించి కొన్ని పుస్తకాలు కూడా అందజేస్తామని రామకృష్ణన్ వివరించారు.
Kangana Ranaut
Kulwinder Kaur
Slap
Gold Ring
TPDK
Tamil Nadu

More Telugu News