Hyderabad: ఇంజినీరింగ్ కాలేజ్ మహిళా ప్రొఫెసర్‌పై డైరెక్టర్ల లైంగిక వేధింపులు!
- గండిపేట సీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఘటన
- తమతో గడపాలంటూ డైరెక్టర్లు ఒత్తిడి చేస్తున్నారంటూ మహిళా ప్రొఫెసర్ ఆరోపణ
- ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం దక్కలేదని ఆవేదన
- ఇతర సిబ్బందితో కలిసి కాలేజీ ఎదుట ధర్నా
హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ మహిళా ప్రొఫెసర్ సంచలన ఆరోపణలు చేశారు. కాలేజీ డైరెక్టర్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపించారు. గండిపేట సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఘటన వెలుగు చూసింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ఐక్యూఏసీ డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రివిక్రమ్ రావులు గత కొంతకాలంగా మహిళా ప్రొఫెసర్‌పై వేధింపులకు పాల్పడుతున్నారు. తమతో గడపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు వారిని హెచ్చరించినా బుద్ధి మార్చుకోలేదని బాధితురాలు వాపోయారు. తాను కాలేజీలో గత 23 ఏళ్లుగా ప్రొఫెసర్‌గా ఉన్నట్టు తెలిపారు. వేధింపులు తాళలేక కన్నీటి పర్యంతమైన మహిళ ప్రొఫెసర్ ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇలాంటి ఘటనలు సర్వసాధారణమంటూ ప్రిన్సిపాల్ నరసింహులు తేలిగ్గా కొట్టి పారేశారని బాధితురాలు ఆరోపించారు. ఈ క్రమంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ బోధన, బోధనేతర సిబ్బంది ధర్నాకు దిగారు. ఇది చూసి ప్రిన్సిపాల్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు.
న్యాయం జరగకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు. డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రివిక్రమ్ రావులతో పాటు ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ గుప్తా పర్వన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.