TG Group 1 Exam: తెలంగాణలో నేడే గ్రూప్ 1 పరీక్ష!
- 31 జిల్లాల్లో 897 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
- ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.00 వరకూ పరీక్ష
- 10 గంటలలోపు పరీక్ష కేంద్రానికి వచ్చిన వారినే అనుమతిస్తామన్న అధికారులు
తెలంగాణలో నేడు గ్రూప్ 1 పరీక్ష జరగనుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే, ఉదయం పది గంటల లోపే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఆ తరువాత వచ్చిన వారిని పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండగా 31 జిల్లాల్లో 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, అధిక శాతం కేంద్రాలు గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల పరిధిలోనే ఉన్నాయి.
అధికారుల సూచనల ప్రకారం, అభ్యర్థులు టీజీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి హాల్‌టిక్కెట్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఏ4 సైజు పేపర్ మీద కలర్ ప్రింటౌట్ తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టిక్కెట్ పై తాజాగా దిగిన ఫొటోను అంటించాలన్నారు. అభ్యర్థులు తమ వెంట ఫొటో ఐడెంటిటీ కార్డు కూడా తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి బ్లాక్ లేదా బ్లూ పెన్ను, హాల్ టిక్కెట్, ఒరిజినల్ ఐడీ కార్డును మాత్రమే అనుమతిస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్ష సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సెక్షన్ 144 విధించనున్నారు.