Dead body inside python: వివాహిత అదృశ్యం.. కొండచిలువ కడుపులో మృతదేహం లభ్యం

Indonesian Woman Who Went Missing Found Inside A Python After 3 Days
  • ఇండోనేషియాలో ఘటన
  • గురువారం బయటకు వెళ్లి తిరిగి రాని మహిళ
  • గ్రామస్తులు, పోలీసుల సాయంతో భార్య కోసం వెతికిన భర్త
  • అడవిలో ఓ చోట కదలలేకుండా పడి ఉన్న కొండచిలువ
  • కొండచిలువ కడుపు చీల్చి చూస్తే కనిపించిన మహిళ మృతదేహం
అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన వివాహిత చివరకు కొండచిలువకు ఆహారంగా మారిన ఘటన ఇండోనేషియాలో తాజాగా వెలుగు చూసింది. దక్షిణ సులవేసీ ప్రావిన్స్‌లోని కాలేంపాంగ్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. 

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఫరీదా అనే 45 ఏళ్ల వివాహితకు నలుగురు పిల్లలు ఉన్నారు. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగిరాలేదు. దీంతో, గ్రామస్థులు, పోలీసుల సాయంతో మహిళ భర్త పరిసరాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వస్తువులు అడవిలో ఓ చోట కనిపించడంతో వారు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగా ఓ చోట 5 మీటర్ల పొడవున్న భారీ కొండ చిలువ ఉబ్బెత్తుగా మారిన ఉదరభాగంతో కదలలేకుండా కనిపించింది. దీంతో, దాని పొట్ట చీల్చి చూడగానే వివాహిత తలభాగం బయటపడింది. మహిళ ఒంటిపై దుస్తులు కూడా యథాతథంగా ఉన్నాయి. కొండచిలువకు తన భార్య ఆహారంగా మారిందని తెలిసి భర్త కన్నీరుమున్నీరయ్యారు.

కొండచిలువలు మనుషులను టార్గెట్ చేయడం అరుదే అయినా ఇండోనేషియాలో ఈ మధ్యకాలంలో పలు ఘటనలు వెలుగు చూశాయని స్థానికులు చెబుతున్నారు. గతేడాది, ఓ రైతును ఊపిరాడకుండా చేసి తినేందుకు ప్రయత్నిస్తున్న కొండచిలువను గుర్తించి చంపేశారు. 2018లో వెలుగు చూసిన మరో ఘటనలో ఏడు మీటర్ల పొడవున్న కొండచిలువ 54 ఏళ్ల మహిళను చంపి తినేసింది. కొన్ని రోజుల తరువాత ఆమె మృతదేహాన్ని కొండచిలువ కడుపులో గుర్తించారు.
Dead body inside python
Indonesia
Viral News

More Telugu News