Nagabala Suresh Kumar: రామోజీరావు చొరవతో నా ఇంటి పేరు మారిపోయింది: నాగబాల సురేశ్‌కుమార్
- ఈటీవీలో ప్రసారమైన నాగబాల సీరియల్
- నిర్మించి, దర్శకత్వం వహించిన సురేశ్‌కుమార్
- ఆ సీరియల్‌కు విపరీత ఆదరణ
- ఆ తర్వాత ఇంటిపేరు నాగబాలగా మారిన వైనం
- రామోజీతో అనుబంధం గుర్తుచేసుకున్న సురేశ్‌కుమార్
రామోజీరావు చొరవతో తన పేరు నాగబాల సురేశ్‌కుమార్‌గా మారిందని తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్, వర్కర్క్స్ ఫెడరేషన్ స్థాపక అధ్యక్షుడు, టీవీ దర్శక నిర్మాత, సినీ రచయిత, నటుడు దండనాయకుల సురేశ్‌కుమార్ గుర్తు చేసుకున్నారు. రామోజీ మృతికి సంతాపంగా నేడు టెలివిజన్ ఇండస్ట్రీ షూటింగ్‌లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
ఆసిఫాబాద్‌కు చెందిన ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన నాగబాల సీరియల్ రామోజీరావు చొరవతోనే ఈటీవీలో ప్రసారమైంది. ఆ సీరియల్‌కు విపరీత ఆదరణ లభించడంతో సురేశ్‌కుమార్ ఇంటి పేరు కాస్తా నాగబాలగా మారిపోయింది. అప్పటి నుంచి ఆయన పేరు నాగబాల సురేశ్‌కుమార్‌గా మారిపోయింది.
1986లో విజయవాడలో తనకు నాటకరంగ పురస్కారాన్ని రామోజీ అందించారని తెలిపారు. గత మార్చి 16న తెలుగు ఫిల్మ్, టెలివిజన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రామోజీకి ‘ద గ్రేట్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’ అవార్డును ప్రదానం చేయడానికి ఆయనను ఆహ్వానించామని, కానీ అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నానని ఉత్తరం రాశారని సురేశ్ కుమార్ గుర్తుచేసుకున్నారు.