Narendra Modi: కాబోయే కేంద్రమంత్రులకు మోదీ 'టీ పార్టీ'... తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు హాజరు
- నేడు సాయంత్రం 7.15 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం
- లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో 'టీ మీటింగ్'
- టీ మీటింగ్‌కు అన్నామలైకి పిలుపు
- కేంద్రమంత్రివర్గంలో శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చోటు
నరేంద్రమోదీ ఈరోజు సాయంత్రం 7.15 గంటలకు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలోకి తీసుకోనున్న వారితో ఆయన లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో 'టీ మీటింగ్' నిర్వహించారు. కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోనున్న వారితో ఆయన ఈ భేటీ నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస వర్మ (బీజేపీ) రామ్మోహన్ నాయుడు (టీడీపీ), పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... పరిపాలనపై దృష్టి సారించాలని, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
సమావేశానికి హాజరైన వారిలో బీజేపీ, ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ఎంపీలు ఉన్నారు. అమిత్ షా (బీజేపీ), నితిన్ గడ్కరీ (బీజేపీ), జ్యోతిరాదిత్య సింధియా (బీజేపీ), శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ), పియూష్ గోయల్ (బీజేపీ), నిర్మలా సీతారామన్ (బీజేపీ), అశ్విని వైష్ణవ్ (బీజేపీ), మన్సుఖ్ మాండవియా (బీజేపీ), గిరిరాజ్ సింగ్ (బీజేపీ), హర్దీప్ సింగ్ పూరి (బీజేపీ), మనోహర్ లాల్ ఖట్టర్ (బీజేపీ), అర్జున్ రామ్ మేఘ్వాల్ (బీజేపీ), కమల్‌జీత్ సెహ్రావత్ (బీజేపీ), రక్షా ఖడ్సే (బీజేపీ) , జార్జ్ కురియన్ (బీజేపీ), రవ్‌నీత్ సింగ్ బిట్టు (బీజేపీ), సీఆర్ పాటిల్ (బీజేపీ), హెచ్‌డి కుమారస్వామి (జెడి-ఎస్), జయంత్ చౌదరి (రాష్ట్రీయ లోక్ దళ్), లలన్ సింగ్ (జేడీయూ), జితన్ రామ్ మాంఝీ (HAM), రాందాస్ అథవాలే (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా), ప్రతాప్ రావు జాదవ్ (షిండే నేతృత్వంలోని శివసేన) తదితరులు ఉన్నారు.
కోయంబత్తూరు నుంచి ఓడిపోయిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైని కూడా ఈ 'టీ మీటింగ్'కు ఆహ్వానించారు. కిరణ్ రిజిజు, శరబానంద సోనోవాల్, నిర్మలా సీతారామన్‌లను కూడా మరోసారి కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.