Pancharama: పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాల్లో శివలింగాలకు రసాయనిక మరమ్మతులు
- పంచారామాలుగా ప్రసిద్ధికెక్కిన ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాలు
- ఆలయాలను సందర్శించిన కేంద్ర పురావస్తు శాఖ అధికారులు
- ఇక్కడి శివలింగాలకు రసాయన సంరక్షణ కల్పిస్తామని వెల్లడి
ప్రముఖ శైవక్షేత్రాలు, పంచారామాలుగా ప్రసిద్ధికెక్కిన ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాల్లో శివలింగాలకు రసాయనిక రక్షణ కల్పించనున్నారు. కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటిండెంట్ వి.కోటయ్య నేడు ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాలను సందర్శించారు.
ఈ ఆలయాల గర్భగుడిలోని శివలింగాల భౌతికస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కోటయ్య మాట్లాడుతూ, శివలింగాలకు రసాయనిక మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఘన వారసత్వం ఉన్న దేవాలయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న లక్ష్యంతో, ఆయా దేవాలయాలను వివిధ పద్ధతుల్లో సంరక్షిస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాల్లోని శివలింగాలను రసాయనాలతో సంరక్షిస్తున్నామని కోటయ్య వివరించారు.