Etela Rajender: అమిత్ షా నుంచి ఫోన్... ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి...?
- అసోం సీఎంను కలవాలని ఈటలకు అమిత్ షా సూచన
- హిమంత బిశ్వశర్మతో సమావేశమైన ఈటల రాజేందర్
- బీజేపీ అధ్యక్ష బాధ్యతల అంశం చర్చకు వచ్చినట్లుగా కథనాలు
తెలంగాణ బీజేపీ నేత, మల్కాజ్గిరి లోక్ సభ స్థానం నుంచి గెలిచిన ఈటల రాజేందర్ రేపు పార్టీ అగ్రనేత అమిత్ షాను కలవనున్నారు. కేంద్ర క్యాబినెట్లో చోటు కోసం తెలంగాణ నుంచి దాదాపు అందరు ఎంపీలు ఆశలు పెట్టుకున్నారు. అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు మాత్రమే మోదీ క్యాబినెట్ లో చోటు దక్కింది. దీంతో ఈటల రాజేందర్ ఒకింత అసంతృప్తి చెందారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా నుంచి ఆయనకు ఫోన్ కాల్ వెళ్లింది.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను కలవాలని ఈటలకు సూచించారు. దీంతో కాసేపటి క్రితం ఈటల రాజేందర్ అసోం సీఎంను కలిశారు. కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై హిమంత బిశ్వతో జరిగిన భేటీలో చర్చకు వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈటల రేపు అమిత్ షాను కలిసిన అనంతరం ఈ అంశంపై స్పష్టత రానుంది.