Gary Kirsten: భారత్ చేతిలో పాకిస్థాన్ ఎందుకు ఓడిందో బయటపెట్టిన ఆ జట్టు కోచ్
- పాక్‌పై ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం
- 15 ఓవర్ల వరకు మ్యాచ్ తమ చేతిలోనే ఉందన్న గ్యారీ కిరెస్టన్
- స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమయ్యామన్న కోచ్
- బ్యాటర్లు తమ వ్యూహాలను అమలు చేయలేకపోయారని ఆవేదన
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ దారుణ పరాభవానికి కారణం ఏంటో ఆ జట్టు కోచ్ వెల్లడించారు. 15 ఓవర్ల వరకు మ్యాచ్ తమ చేతిలోనే ఉందని, ఆ తర్వాతే ప్లాన్ దెబ్బతిందని ఇటీవలే ఆ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గ్యారీ కిరెస్టన్ తెలిపాడు.
15 ఓవర్ల తర్వాత ఒత్తిడి పెరిగి అది బ్యాటర్లపై ప్రభావం చూపించిందని పేర్కొన్నాడు. వ్యూహాలను అనుసరించడంతో బ్యాటర్లు విఫలమయ్యారని, అదే తమ కొంప ముంచిందని తెలిపాడు. ఇలాంటి పిచ్‌లపై స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ ఉండాలని, కానీ అందులో తమ బ్యాటర్లు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్నిసార్లు ఇలాంటి మ్యాచ్‌ను కూడా చూడాల్సి వస్తుందని పేర్కొన్నాడు.
15 ఓవర్ల వరకు అద్భుతంగా ఆడామని, ఆ తర్వాత వికెట్లు త్వరత్వరగా పడిపోవడంతో వ్యూహం విఫలమైందని వివరించాడు. వికెట్లు వేగంగా పడిపోతున్న సమయంలో ఆటగాళ్లు మరింత బాధ్యతగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించాడు.
న్యూయార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 120 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 59 డాట్ బాల్స్ ఉండడం కూడా ఓటమికి కారణమైంది.