Rahul Gandhi: మోదీ మళ్లీ ప్రధాని అయ్యే ఛాన్సే లేదన్న రాహుల్.. ఎన్నికల ప్రచారం నాటి వీడియోను పోస్ట్ చేసిన బీజేపీ నేత

Rahul Gandhi Video Is Viral After Modi Takes Oath As Prime Minister
  • ఓ సభలో ఎన్నికల ఫలితాలపై రాహుల్ జోస్యం
  • మోదీ ప్రధాని కారని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ
  • కావాలంటే కాగితంపై రాసిస్తానంటూ వ్యాఖ్యలు
  • నాటి వీడియోను తాజాగా ట్వీట్ చేసిన కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కారంటూ లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ నేతలు ఎంతో ధీమాగా చెప్పారు. ఎన్డీయే కూటమికి ఇక అధికారం పగటి కలేనని పలువురు సీనియర్ నేతలు కూడా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇదేవిధంగా పలు సభలలో చెప్పుకొచ్చారు. ఓ ప్రచార సభలో మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేసిన ఈ వీడియోలో మోదీ ఇక ప్రధాని కాబోరంటూ రాహుల్ గాంధీ జోస్యం చెప్పడం కనిపిస్తోంది. ఈ వీడియోకు ‘ఇన్ ఫేమస్ లాస్ట్ వర్డ్స్’ అంటూ రాజీవ్ చంద్రశేఖర్ క్యాప్షన్ జోడించారు.

‘దేశవ్యాప్తంగా ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, ఓ విషయంలో మాత్రం నేను మీకు గ్యారెంటీ ఇవ్వగలను. అదేంటంటే.. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశమే లేదు. ఆయన ప్రధాని కాబోరు. ఫలితాల తర్వాతా జరగబోయేది ఇదే. వందకు వంద శాతం నిజమిది. కావాలంటే ఇక్కడున్న మీకందరికీ కాగితంపై రాసిస్తా’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మాటలకు అక్కడున్న వారంతా గట్టిగా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు.
Rahul Gandhi
Prediction About Modi
PM Oath
lok sabha polls
Viral Videos
BJP

More Telugu News