Swami Swaroopananda: ఇవాళ మేం మీడియా ముందుకు వచ్చింది ఎవరికీ భయపడి కాదు: స్వామి స్వరూపానంద
- తాము ఎవరి ప్రాపకం కోసం చూడడంలేదన్న స్వామి స్వరూపానంద
- విశాఖ శారదాపీఠం రాజకీయ నేతలతో ఎదగలేదని స్పష్టీకరణ
- శ్రీశైలంలో కుంభాభిషేకం వద్దని జగన్ ప్రభుత్వానికి చెప్పామని వెల్లడి
- తమ మాట వినిపించుకోలేదని, ఇప్పుడేం జరిగిందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యలు
- చంద్రబాబు అంటే తమకు చాలా గౌరవం అని వివరణ
తాము ఎవరి ప్రాపకం కోసం చూడడంలేదని, ఇది భక్తులతో ఎదిగిన పీఠం అని, రాజకీయ నాయకులతో ఎదిగిన పీఠం కాదని విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి తమకు లేదని అన్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక పీఠం అని, ధర్మం కోసమే తాము పనిచేస్తామని ఉద్ఘాటించారు.
"గత నాలుగేళ్ల నుంచి మేం ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇదే మొదటిసారి. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. భారతదేశానికి దశాదిశా నిర్దేశం చేస్తున్న బీజేపీ మూడోసారి అత్యద్భుతంగా గెలుపొందింది. కాశీ, అయోధ్య, ఉజ్జయిని వంటి క్షేత్రాలను గొప్పగా అభివృద్ధి చేసి... కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి క్షేత్రాలకు రహదారి సదుపాయాలు కల్పించిన మోదీ గతరాత్రి మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయడం మాకు చాలా ఆనందం కలిగించింది.
అలాగే, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ కూటమి ప్రమాణ స్వీకారం చేసే ముందు ఈ ప్రెస్ మీట్ పెట్టాలి అని నిర్ణయించుకున్నాం. మాకు ఆనందకర విషయం ఏమిటంటే... నిన్న క్యాబినెట్లో రామ్మోహన్ నాయుడికి స్థానం లభించింది. నేను పుట్టింది శ్రీకాకుళం ప్రాంతంలోనే. మాకు, కింజరాపు ఎర్రన్నాయుడికి మంచి సంబంధాలు ఉండేవి. ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్లాం.
ఆయన కుమార్తె పెళ్లి రాజమండ్రిలో జరిగితే మేం కూడా హాజరయ్యాం. వారికి మేం అంటే అపారమైన గౌరవం. వారి అబ్బాయి (రామ్మోహన్ నాయుడు) మొదటిసారి ఎంపీగా గెలవకముందు అరసవల్లిలో ఆశీర్వదించడం కూడా జరిగింది. అలాంటి చిన్న కుర్రాడు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తరఫున క్యాబినెట్లో స్థానం పొందడం, శ్రీకాకుళం నుంచి వెళ్లి భారతదేశానికే మంత్రి కావడం మాకు సంతోషం కలిగించే విషయం.
రామ్మోహన్ నాయుడు అంత అదృష్టం పొందాడంటే అందుకు చంద్రబాబు నాయుడే కారణం. చంద్రబాబు... రామ్మోహన్ నాయుడి పేరు ప్రతిపాదించి అతడ్ని కేంద్రమంత్రిని చేయడం హర్షణీయం.
చంద్రబాబు ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇది చాలా అత్యద్భుతమైన ముహూర్తం... సింహలగ్నం... బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఈ రాష్ట్రాన్ని, దేవాదాయ ధర్మాదాయ శాఖను, టీటీడీని, ఇతర వ్యవస్థలను గొప్పగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ ప్రజలు మెచ్చేలా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం.
చంద్రబాబు చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి... ఎంతో అనుభవం వుంది... మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశారు. కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్న నాయకుడు. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి, ఆర్థికంగా బలోపేతం చేసేలా శక్తిని ఇవ్వాలని భగవంతుడ్ని కోరుతున్నాం.
అదేవిధంగా, అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత... మేం కూడా శారదాపీఠం తరఫున అమరావతిలో కొంత స్థలాన్ని కొనుగోలు చేశాం. ఇతర ప్రాంతాల్లో మాదిరే అమరావతిలో కూడా శారదా పీఠం నిర్మించాలని అనుకున్నాం. మా అమ్మవారు రాజశ్యామల అమ్మవారు. ఏ ప్రభుత్వం వచ్చినా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండేలా ఆశీర్వదిస్తాం. ఎప్పట్లాగానే యజ్ఞాలు, హోమాలు చేస్తాం.
ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే... ఎల్లుండి (జూన్ 12) ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంది. మేం కూడా రిషికేశ్ కు చాతుర్మాస దీక్షకు వెళ్లాల్సి ఉంది. మరో మూడ్నాలుగు నెలలు ఆంధ్రాకు తిరిగి రాబోము కాబట్టి... ఇవాళ మంచి రోజు అని మాట్లాడుతున్నాం.
నేను విశాఖ పీఠాధిపతిగా వచ్చి ఇవాళ్టికి 30 సంవత్సరాలు. ఏనాడూ రాష్ట్రాల పరిపాలనా విషయాల్లో జోక్యం చేసుకోలేదు. ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం చూశాను, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడం చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, మళ్లీ చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టారు. నేను ఏ ప్రభుత్వంలోనూ తలదూర్చలేదు.
అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ... తెలిసిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అలవాటు. లౌక్యంగా మాట్లాడడం తెలియదు. ఎప్పుడూ కూడా తప్పులు ఉంటే చెప్పడమే అలవాటు. శ్రీశైలం క్షేత్రంలో కుంభాభిషేకం చేయొద్దని చెప్పింది నేను. దక్షిణాయనంలో అలాంటివి చేయడకూడదని జగన్ ప్రభుత్వాన్ని ఆపాను. కానీ కోర్టులను మేనేజ్ చేసి, ఉత్తరాయణం వచ్చింది కదా అని కుంభాభిషేకం చేశారు.
మాఘమాసంలో అలాంటి అభిషేకాలు చేయకూడదని ఆగమశాస్త్రంలో రాశారు. కానీ చేశారు... మరి ఇవాళ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన ఘటనలపై నేను ఎలా మాట్లాడానో అందరూ చూశారు. తిరుమలలో వందలాది సంవత్సరాలుగా ఆనవాయతీగా వస్తున్న అన్న ప్రసాదాన్ని తృణధాన్యాలతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను... ప్రభుత్వానికి లేఖ కూడా రాశాను.
నేను కానీ, మా పీఠం కానీ... ఏ ప్రభుత్వం మా వద్దకు వచ్చినా మేం ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదిది. నేను తప్పులు చేయను అనే విషయం ఏబీఎన్ రాధాకృష్ణకు, టీవీ5 బీఆర్ నాయుడికి, ఎన్టీవీ నరేంద్ర చౌదరికి తెలుసు... ఇంకా చాలామందికి తెలుసు. ఈ ఐదేళ్లలో పీఠం ఎలా తప్పులు చేయకుండా ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది. అప్పుడూ, ఇప్పుడూ యుద్ధమే చేస్తున్నాం.
చంద్రబాబును నేనేదో కొత్తగా పొగుడుతున్నానని అనుకోవద్దు. ఆయన గతంలో ముఖ్యమంత్రి అయ్యారు. రాజమండ్రిలో సాధువులతో కలిసి పెద్ద సభ నిర్వహించి ఆయన విజయం కోసం కృషి చేశాం. అప్పుడు చంద్రబాబు గెలిచారు... ఆయన గెలవడం మాకు చాలా సంతోషం అని అప్పుడు కూడా నేను స్టేట్ మెంట్ ఇచ్చాను. మాకు ఎవరితోనూ విభేదాలు ఉండవు, మేం స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడుతాం.
మేం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికీ భయపడి కాదు... అది గుర్తుంచుకోవాలి. వాస్తవాలు తెలుసుకోకుండా, ఎవరెవరో తప్పుడు అభిప్రాయాలు చెబుతారని, స్వరూపానంద ఎప్పుడూ ఒకలాగే ఉంటారని చెప్పడమే ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం.
చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం. రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవారు. ఈ రాష్ట్రానికి పెద్దదిక్కుగా ఆయన పరిపాలన కొనసాగాలి. ఆయన కుటుంబం బాగుండాలి. ఆయనకు పరిపూర్ణమైన ఆయుష్షును భగవంతుడు ఇవ్వాలి. ఈసారైనా టీటీడీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ గొప్పగా విలసిల్లాలి... అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాం" అని స్వామి స్వరూపానంద వివరించారు.