RSS: లోక్‌సభ ఎన్నికలు, పార్లమెంట్ నిర్వహణపై తొలిసారి స్పందించిన ఆర్ఎస్ఎస్ చీఫ్

Elections are over and the focus should shift to nation building RSS chief Mohan Bhagwat
  • ఎన్నికలు పోటీ మాత్రమే.. యుద్ధం కాదన్న మోహన్ భగవత్
  • ఏకాభిప్రాయం కోసమే ఎన్నికల ప్రక్రియ అని వ్యాఖ్య
  • పార్లమెంటులో ప్రతి అంశంపై రెండు కోణాల్లో చర్చ జరగాలని అధికార, విపక్షాలకు సూచన
లోక్‌సభ ఎన్నికలు, పార్లమెంట్ నిర్వహణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తొలిసారి స్పందించారు. ఎన్నికలు ముగిసిపోయాయని, ఇక దేశ నిర్మాణంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు యుద్ధం కాదని, పోటీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఏకాభిప్రాయం కోసం జరిగే ప్రక్రియ అని అన్నారు. పార్లమెంటుకు రెండు పార్శ్వాలు  ఉంటాయని, కాబట్టి ఏ ప్రశ్ననైనా రెండు కోణాల్లో పరిగణించ వచ్చునని సూచించారు. ప్రతి సమస్యకు రెండు వైపులా ఆలోచించాలని, ఒక పార్టీ ఒక వైపు ప్రస్తావిస్తే.. ప్రతిపక్ష పార్టీ మరొక కోణాన్ని ప్రస్తావించాలని అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా మాత్రమే సరైన నిర్ణయానికి చేరుకోగలమని భగవత్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఈ మేరకు నూతన ప్రభుత్వం, ప్రతిపక్షాలకు ఆయన సలహాలు ఇచ్చారు. 

ప్రతి ఐదేళ్లకోసారి ప్రజాతీర్పు వస్తుందని, అయితే ఈ ప్రజా నిర్ణయం ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి? అనే అంశాలు ఆర్ఎస్ఎస్‌కు సంబంధించినవి కావని భగవత్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి ఎన్నికలలో ప్రజాభిప్రాయాన్ని మెరుగైన రీతిలో అర్థం చేసుకోవడానికి సంఘ్ పని చేస్తుంది. ఈసారి కూడా అదే పని చేసింది. ఎన్నికల ఫలితాల విశ్లేషణలోనే ఆగిపోలేదు. నేతలను ఎందుకు ఎన్నుకుంటారు? వివిధ అంశాలపై ఏకాభిప్రాయంతో పార్లమెంట్‌కు వెళ్లడానికి ఎన్నుకుంటారు. ఏకాభిప్రాయం మన సంప్రదాయం. ఆ దిశగా పురోగతి కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ యుద్ధం కాదు.. పోటీ మాత్రమే’’ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.

కాగా లోక్‌సభ ఎన్నికల్లో రెండు పక్షాలుగా విడిపోయి ప్రచారం నిర్వహించిన తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికలు, పరిపాలనలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
RSS
Mohan Bhagwat
Lok Sabha Polls
Narendra Modi

More Telugu News