Hanumakonda: హనుమకొండలో వింత ఘటన.. 5 గంటలపాటు చెరువులో తేలియాడిన వ్యక్తి!
- నీటిలో తేలాయాడుతూ కనిపించడంతో చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు
- పోలీసులు బయటకు తీయగా లేచి కూర్చోవడంతో అందరూ షాక్
- చెరువులో రెస్ట్ తీసుకుంటున్నానంటూ వ్యక్తి సమాధానం
హనుమకొండలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 5 గంటలపాటు చెరువులో తేలియాడుతూ కనిపించడంతో చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో చెరువు వద్దకు వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా లేచి నడిచిరావడంతో అక్కడ ఉన్నవారంతా నోరెళ్లబెట్టారు.
వివరాల్లోకి వెళితే.. కేయూసీ పోలీస్‌స్టేషన్ పరిధి రెడ్డిపురంలోని కోవెలకుంటలో దాదాపు 46 ఏళ్ల ఓ వ్యక్తి సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నీటిలో తేలియాడుతూ కనిపించాడు. దాంతో స్థానికులు అతడు చనిపోయి ఉంటాడని అనుకున్నారు. వెంటనే ఫోన్ చేసి కేయూసీ పోలీసులు, 108కు సమాచారం ఇచ్చారు.
వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని బయటకు తీసే క్రమంలో అతడు లేచేసరికి అవాకయ్యారు. ‘ఇక్కడ చల్లగా ఉందని నేను రెస్ట్ తీసుకుంటున్నా. నేను చనిపోలేదు. బతికే ఉన్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. తన పేరు శ్రీనివాస్ అని, తన స్వగ్రామం ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి అని కూడా చెప్పాడు.
తాను కాజీపేట సమీపంలోని ఓ గ్రానైట్ కంపెనీలో పది రోజులుగా వేడి వాతావరణంలో పని చేస్తున్నానని తెలిపాడు. అందుకే చెరువులో పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పాడు. రూ. 50 ఇస్తే తిరిగి కాజీపేటకు వెళ్లిపోతానంటూ పోలీసులను అభ్యర్థించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.