NEET: నీట్ కౌన్సెలింగ్ పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎంట్రన్స్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు
- దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రవేశ పరీక్ష పవిత్రత దెబ్బతిందని వ్యాఖ్య
- కేసు తదుపరి విచారణ జులై 8కి వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం
ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది మే 5న జరిగిన నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజబిలిటీ టెస్ట్ (నీట్) ప్రవేశపరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారని.. దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎంట్రన్స్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ)కు నోటీసులు జారీ చేసింది.
అయితే ఈలోగా జరగనున్న నీట్ కౌన్సెలింగ్ పై స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. కేసు తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లాలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
మంగళవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మీరేమీ పవిత్రమైన పనిచేయలేదు. ఇది తేలికగా కొట్టిపారేసే విషయం కాదు. పరీక్షల పవిత్రత దెబ్బతింది. దీనిపై మేం సమాధానాలు కోరుకుంటున్నాం. ఎప్పటిలోగా సమాధానం చెబుతారు? కాలేజీల రీఓపెనింగ్ జరిగిన వెంటనే చెబుతారా? లేదంటే ఈలోగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ మొదలవుతుంది’ అని జస్టిస్ అమానుల్లా ఎన్ టీఏ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి ప్రశ్నించారు.
దీనికి ఎన్ టీఏ తరఫు అడ్వొకేట్ స్పందిస్తూ ఇప్పటికే దాఖలైన మరో కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారిస్తోందని.. మే 17న తమకు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఆ కేసు విచారణ జులై 8కి వాయిదా పడినందున ఈ కేసును కూడా అదే కేసుకు జత చేయాలని కోరారు.
అంతకుముందు పిటిషనర్ల తరఫు అడ్వొకేట్ మ్యాథ్యూస్ జె. నెడుంపరా వాదిస్తూ నీట్ కౌన్సెలింగ్ పై స్టే విధించాలని కోరారు. కానీ అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. ‘కౌన్సెలింగ్ మొదలవనివ్వండి. మేం కౌన్సెలింగ్ ను ఆపం. ఈలోగా ఎన్ టీఏకు నోటీసులు జారీ చేయండి. వారు సమాధానం పంపుతారు’ అని జస్టిస్ విక్రమ్ నాథ్ మౌఖికంగా ఆదేశించారు.
నీట్ ప్రవేశపరీక్ష పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నందున పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఎన్ టీఏను ఆదేశించాలంటూ జూన్ 1న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శివాంగీ మిశ్రా అనే వ్యక్తితోపాటు మరికొందరు ఈ పిటిషన్ వేశారు. మరోవైపు జూన్ 4న నీట్ ఫలితాలు వెలువడ్డాక కొందరు విద్యార్థులు సైతం సుప్రీంకోర్టుకెక్కారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొందరు విద్యార్థులకు మాత్రమే గ్రేస్ మార్కులు కలపడాన్ని తప్పుబడుతూ కేసు వేశారు. కానీ ఈ కేసుపై మంగళవారం విచారణ జరగలేదు.
అంతకుముందు మే 17న సైతం నీట్ ప్రవేశపరీక్షను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎన్ టీఏకు నోటీసులు జారీ చేసింది. అయితే అప్పుడు ఫలితాల ప్రకటనపై స్టే విధించేందుకు నిరాకరించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలపై స్టే విధించడం కుదరదని తేల్చి చెప్పింది. కేసు తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.