Sharad Pawar: అయోధ్యలో బీజేపీ ఓటమిపై శరద్ పవార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
- ఆలయ రాజకీయాలను అయోధ్య ప్రజలు సరిదిద్దారన్న ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్
- బీజేపీకి సీట్ల తగ్గుదలలో ఉత్తరప్రదేశ్ ప్రజలు కీలక పాత్ర పోషించారని వ్యాఖ్య
- బీజేపీకి వచ్చిన సీట్లు మెజారిటీకి చాలా తక్కువన్న పవార్
ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య ఆలయం ఉండే ఫైజాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలవడంపై ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్, రాజకీయ అనుభవజ్ఞుడు శరద్ పవార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆలయ రాజకీయాలను ఏ విధంగా సరిదిద్దవచ్చో అయోధ్య ప్రజలు చేతల్లో చూపించారని, బీజేపీని ఓడించి ఆలయ రాజకీయాలను సరిచేశారని వ్యాఖ్యానించారు. పూణే జిల్లాలోని బారామతిలో మంగళవారం జరిగిన వ్యాపారుల సమావేశంలో పవార్ మాట్లాడారు. ఐదేళ్ల క్రితం బీజేపీ 300 కంటే ఎక్కువ సీట్లు సాధించిందని, అయితే ఈసారి ఎన్నికల్లో సీట్ల సంఖ్య 240కి పడిపోయిందని, ఈ సంఖ్య మెజారిటీకి చాలా తక్కువని పవార్ అన్నారు.
ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 60 సీట్లు తగ్గాయని, సీట్ల సంఖ్య తగ్గుదలలో ఉత్తరప్రదేశ్ కీలక రాష్ట్రంగా ఉందని, అక్కడి ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని పవార్ వ్యాఖ్యానించారు. రామమందిరమే ఎన్నికల ఎజెండా అని, అధికార పార్టీకి ఓట్లు పడతాయని తాను కూడా భావించానని, అయితే దేశ ప్రజలు చాలా తెలివైనవారని పవార్ అన్నారు. ఆలయం పేరిట ఓట్లు అడుగుతున్నారని గ్రహించి తమ వైఖరిని మార్చుకున్నారని, ఫలితంగా బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని అన్నారు. ఓట్లు అడిగేందుకు, ఎన్నికల ఎజెండాగా అయోధ్య ఆలయాన్ని ఉపయోగించడాన్ని చూసి తాము భయపడ్డామని పేర్కొన్నారు.
కాగా అయోధ్య ఆలయ పట్టణం ఉన్న ఫైజాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సిట్టింగ్ బీజేపీ ఎంపీ లల్లూ సింగ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ ఏకంగా 54,567 ఓట్ల తేడాతో విజయం సాధించారు.