Mercy Petition: ఎర్రకోటపై దాడి కేసు.. పాక్ ఉగ్రవాదికి క్షమాభిక్ష నిరాకరించిన రాష్ట్రపతి ముర్ము
- 2000 డిసెంబరు 22న ఎర్రకోటపై దాడి
- లష్కరే ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
- మరణశిక్షను ఖరారు చేసిన సుప్రీంకోర్టు
- భారత రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన పాక్ ఉగ్రవాది
ఇరవై నాలుగేళ్ల కిందట దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తోసిపుచ్చారు.
ఈ కేసులో పాక్ టెర్రరిస్టు మహ్మద్ ఆరిఫ్ కు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2022 నవంబరు 3న అతడి రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో, అతడికి మరణశిక్ష ఖరారైంది. ఈ నేపథ్యంలో, మే 15న ఆరిఫ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును క్షమాభిక్ష కోరాడు. అయితే అతడి పిటిషన్ ను ముర్ము మే 27న తోసిపుచ్చగా, మే 29న ఆ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
2000 సంవత్సరం డిసెంబరు 22న ఎర్రకోట వద్ద నెం.7 రాజ్ పుటానా రైఫిల్స్ సైనిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు భారత జవాన్లు మరణించారు.
ఈ దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు పాక్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ ను అరెస్ట్ చేశారు. అతడు నిషిద్ధ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుడు అని గుర్తించారు. ఆరిఫ్ ఈ దాడికి ఇతర మిలిటెంట్లతో కలిసి కుట్ర పన్నాడన్న అభియోగాలు కోర్టులో నిరూపణ అయ్యాయి.
ఆనాడు ఎర్రకోటపై దాడికి పాల్పడిన అబు షాద్, అబు బిలాల్, అబు హైదర్ వేర్వేరు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు.