Gangster Pro pak slogans: కర్ణాటకలో కోర్టు ముందు గ్యాంగ్స్టర్ పాక్ అనుకూల నినాదాలు.. దేహశుద్ధి!
- కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఘటన
- ఏడీజీపీని బెదిరించిన కేసులో నిందితుడుగా ఉన్న గ్యాంగ్స్టర్ జయేశ్ పూజారీ
- జిల్లా కోర్టులోకి నిందితుడిని తీసుకెళుతుండగా పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు
- అక్కడున్న వారు నిందితుడికి దేహశుద్ధి చేసిన వైనం, జయేశ్పై కేసు నమోదు
- అకస్మాత్తుగా పాక్ అనుకూల నినాదాలు ఎందుకు చేశాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు
కర్ణాటకలో ఓ జిల్లా కోర్టు ముందు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన గ్యాంగ్స్టర్ జయేశ్ పుజారీ అలియాస్ షకీల్కు అక్కడున్న వారు దేహశుద్ధి చేశారు. బెళగావి జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 2018 నాటి ఓ కేసుకు సంబంధించి విచారణ కోసం పోలీసులు అతడిని కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులోపలికి వెళ్లే క్రమంలో అతడు అకస్మాత్తుగా పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడు. దీంతో, అక్కడున్న వారు అతడిపై చేయి చేసుకున్నారు. మరోవైపు, పోలీసులు వెంటనే అతడిని వారి బారినుంచి కాపాడి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆరు సంవత్సరాల క్రితం జయేశ్ ఓ ఏడీజీపీని బెదిరించిన కేసులో అతడిని కోర్టుకు తీసుకురాగా ఈ ఘటన జరిగింది.
నిందితుడు నేరాలకు అలవాటు పడ్డాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే అతడిపై పలు నేరాలు నమోదయ్యాయని అన్నారు. రెండు హత్య కేసులు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బెదిరించిన కేసులు ఉన్నాయని తెలిపారు. తాజాగా ఘటనకు సంబంధించి కూడా అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే, జయేశ్ అకస్మాత్తుగా పాక్ అనుకూల నినాదాలు చేయడానికి కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం జయేశ్ హిండాల్గాలోని కేంద్ర కారాగారంలో ఉన్నాడని, అతడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తామని పేర్కొన్నారు.