Arshdeep Singh: అశ్విన్ రికార్డును బ్రేక్ చేసిన అర్ష్‌దీప్ సింగ్!
- టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తరపున ఉత్తమ గణాంకాలను (4/9) నమోదు చేసిన అర్ష్‌దీప్
- ఇంతకుముందు (4/11) గణాంకాలతో అశ్విన్ పేరిట ఈ రికార్డు
- 2014 టీ20 ప్రపంచకప్ లో ఈ రికార్డును సాధించిన భారత స్పిన్నర్
- మూడో స్థానంలో హర్భజన్ సింగ్ (4/12)
టీ20 ప్రపంచకప్ లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా సూపర్-8లో అడుగు పెట్టింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ జట్టును భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు.
ఇక నాలుగు వికెట్లతో రాణించిన అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. అలాగే పదేళ్ల రవిచంద్రన్ అశ్విన్ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తరపున ఉత్తమ గణాంకాలను (4/9) నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు (4/11) గణాంకాలతో అశ్విన్ పేరిట ఉంది. 2014 టీ20 ప్రపంచకప్ లో మీర్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఈ స్పిన్నర్ 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
అలాగే మూడో స్థానంలో హర్భజన్ సింగ్ (4/12) ఉన్నాడు. 2012లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఈ గణాంకాలను సాధించాడు. కాగా, నిన్నటి మ్యాచ్ లో బెస్ట్ బౌలింగ్ తో ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.