Yediyurappa: ఆ కేసులో యడియూరప్పను అరెస్ట్ చేసే అవకాశముంది: కర్ణాటక హోంమంత్రి
- సీఐడీ దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్న హోంమంత్రి పరమేశ్వర
- 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా కేసు
- బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను రికార్డ్ చేసిన సీఐడీ
మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ అగ్రనేత యడియూరప్పను ఫోక్సో కేసులో అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశముందని రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర గురువారం వెల్లడించారు. సీఐడీ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా యడియూరప్పపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదయింది. ఓ కేసుకు సంబంధించి బాధితురాలు, ఆమె తల్లి సాయం కోసం యడియూరప్ప వద్దకు వచ్చారు. ఈ సమయంలో తన కూతురును బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఫోక్సో కేసు నమోదయింది. ఈ కేసును సీఐడీ దర్యాఫ్తు చేస్తోంది. బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ ఇది వరకే రికార్డ్ చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ ఆధికారులు బుధవారం యడియూరప్పకు సమన్లు పంపించారు. ప్రస్తుతం తాను ఢిల్లీలో ఉన్నందున జూన్ 17న సీఐడీ ఎదుట హాజరవుతానని ఆయన సమాధానం పంపించారు.