Anil Kumar Yadav: ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న చాలెంజ్ పై అనిల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Anil Kumar Yadav talks about his challenge

  • ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీ చేసిన అనిల్
  • లోక్ సభ ఎన్నికల్లో లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఓటమి
  • తన చాలెంజ్ ను ఎవరూ స్వీకరించలేదని వెల్లడి
  • అందుకే మాటకు కట్టుబడి ఉండాల్సిన పనిలేదని స్పష్టీకరణ

వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఎన్నికల సందర్భంగా నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి నరసరావుపేట లోక్ సభ స్థానానికి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో అనిల్ కుమార్ మాట్లాడుతూ, పౌరుషాల గడ్డ పల్నాడులో నిలబడి చెబుతున్నానని, ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మీసం మెలేసి సవాల్ విసిరారు.

ఇటీవల ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. దాంతో, సోషల్ మీడియాలో అనిల్ కుమార్ యాదవ్ పై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఎప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఆయనను మీడియా స్పందన కోరింది. అందుకు అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికరంగా బదులిచ్చారు. 

ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తాను సవాల్ విసిరింది నిజమేనని, అయితే తన సవాల్ ను ఎవరైనా స్వీకరించినప్పుడే మాట నిలుపుకోవాల్సిన అవసరం తనకుంటుందని అన్నారు. తన సవాల్ ను ఎవరూ తీసుకోనప్పుడు, తాను మాటకు కట్టుబడి ఉండాల్సిన పనిలేదని, ఎవరి కోసం తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని తిరిగి ప్రశ్నించారు. 

హనుమాన్ జంక్షన్ సినిమాలో  ఒక డైలాగు తనకు బాగా ఇష్టమని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. "గెలిచినవాడు చెప్పాలి... ఓడినవాడు వినాలి అని ఆ సినిమాలో డైలాగు ఉంది. ఇవాళ వాళ్లు (టీడీపీ) చెబుతున్నారు... మేం వింటున్నాం... వాళ్లు ట్రోలింగ్ చేసుకుంటున్నారు... చేసుకోనివ్వండి... ఫర్వాలేదు" అని అనిల్ కుమార్ వివరించారు. మమ్మల్ని ట్రోల్ చేసేంత స్థాయిలో మేం ఉన్నామంటే మేం ఎదిగినట్టే... అది కూడా మాకు పబ్లిసిటీనే అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News