Sabitha Indra Reddy: రేవంత్ రెడ్డి గారూ... చంద్రబాబును చూసి నేర్చుకోండి: సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy suggetion to Revanth Reddy
  • తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉంటే తప్పేమిటని ప్రశ్న
  • పుస్తకాల్లో కేసీఆర్ ఫొటో తొలగించాలని పుస్తకాలు వెనక్కి తీసుకోవడంపై ఆగ్రహం
  • జగన్ ఫొటోతో ఉన్న పుస్తకాలు పంపిణీ చేయాలని చంద్రబాబు హుందాగా ఆదేశించారని వెల్లడి
  • ప్రజాధనం వృథా చేయవద్దని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్న మాజీ మంత్రి
  • కేసీఆర్ మీద కోపంతో జాతీయ గీతాన్ని అవమానిస్తారా? అని ప్రశ్న
తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉంటే తప్పేమిటని తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ ఫొటో, గుర్తును తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె సూచించారు. పక్క రాష్ట్రం ఏపీలో జగన్ బొమ్మలతో కూడిన కిట్లను పిల్లలకు యథావిధిగా పంపిణీ చేయాలని నిర్ణయించారని తెలిపారు. ప్రజాధనం వృథా చేయవద్దని అధికారులకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు హుందాగా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. చంద్రబాబును చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని హితవు పలికారు.

తమిళనాడులోను స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే... జయలలిత ఫొటోతో ఉన్న పుస్తకాలు, బ్యాగ్స్‌ను యథావిధిగా విద్యార్థులకు ఇచ్చి హుందాతనాన్ని చాటుకున్నారన్నారు. మరి రేవంత్ రెడ్డి హుందాతనం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు తెలుగు పాఠ్య‌ పుస్త‌కాల్లో కేసీఆర్ పేరు ఉండ‌డంతో ఆ పుస్త‌కాల‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై సబిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలలైనా పాలనపై దృష్టి పెట్టలేదని చెప్పడానికి ఈ వ్యవహారమే నిదర్శనమన్నారు.

విద్యార్థులకు ఇచ్చిన పుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉందని... బుక్స్ వెనక్కి తెప్పించడం, ఆ పేజీలను చించేయడం, ఆ పేజీలపై మరో పేజీని అతికించడం సమంజసమా? అని ప్రశ్నించారు. చించేసిన పేజీల వెనుక వందేమాతరం, జనగణమన, ప్రతిజ్ఞలు ఉన్నా పట్టదా? అని నిలదీశారు. కేసీఆర్ మీద కోపంతో జాతీయ గీతాన్ని అవమానిస్తారా? అని మండిపడ్డారు. పుస్తకాలు, యూనిఫామ్స్ ఆలస్యంగా అందించే సంస్కృతికి తాము ముగింపు పలికామన్నారు. ఈ ఏడాది పుస్తకాలతో పాటు బ్యాగ్స్ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారని... దానిని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Sabitha Indra Reddy
Revanth Reddy
KCR
Chandrababu

More Telugu News