Priyanka Gandhi: వయనాడ్ ఉపఎన్నిక.. బరిలో ప్రియాంక గాంధీ?

Speculation rife over priyanka gandhi contesting in wayanad bypoll
  • ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రంపై మరోసారి ఉత్కంఠ
  • వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలుపొందిన రాహుల్ గాంధీ
  • యూపీకున్న రాజకీయ ప్రాధాన్యం రీత్యా రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగే ఛాన్స్ 
ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఇటీవలి ఎన్నికల ముందు ఆమె పోటీకి దిగుతారని వార్తలు వెలువడగా ఆమె వాటిని ఖండించారు. ఇక రాయ్‌బరేలీ, వయనాడ్‌ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ సీటు వదులుకోనున్నారన్న వార్తల నడుమ మరోసారి ప్రియాంక ఎన్నికల అరంగేట్రంపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. రాహుల్ వయనాడ్‌ను వదులుకుంటే అక్కడి నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. 

రాయ్‌బరేలీ, వయనాడ్‌ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన రాహుల్ గాంధీ భారీ మార్జిన్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రియాంక గాంధీ రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠను మరింత పెంచాయి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సోదరి వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే మోదీ 2 - 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారని అన్నారు.  

ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతారన్న వార్తలు 2019 లోక్‌సభ ఎన్నికల నుంచే మొదలయ్యాయి. అప్పట్లో ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తారన్న కథనాలు వెలువడగా ఆమె వాటిని ఖండించారు. ఆ తరువాత 2022 యూపీ ఎన్నికల సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తాను సీఎం అభ్యర్థిని కావచ్చని కూడా వ్యాఖ్యానించారు. ఆ తరువాత తాను నోరు జారానంటూ వివరణ ఇచ్చారు. 

ఇక ఈసారి ఎన్నికల ముందు సోనియా గాంధీ తన కంచుకోట రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి తప్పుకుని రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో, ఆమె స్థానంలో ప్రియాంక బరిలో దిగుతారన్న ఊహాగానాలు బయలుదేరాయి. రాహుల్ గాంధీ అమేథీ నుంచి స్మృతీ ఇరానీపై పోటీ చేస్తారని కూడా భావించారు. ఈ విషయమై ఆలోచించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా వారిని కోరినట్టు కథనాలు వెలువడ్డాయి. గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా పేరు గాంచిన నియోజకవర్గాల నుంచి పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారట. అయితే, తాను బరిలో దిగబోనని ప్రియాంక మరోసారి స్పష్టం చేస్తూ ఊహాగానాలకు ముగింపు పలికారు. తనూ బరిలోకి దిగి గెలిస్తే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు పార్లమెంటులో కాలుపెట్టినట్టు అవుతుందని, కుటుంబపాలన అంటూ విమర్శలు గుప్పిస్తున్న బీజేపీకి ఇది మరో ఆయుధంగా మారుతుందని ఆమె భావించారట. 

వయనాడ్‌ నియోజకవర్గాన్ని రాహుల్ వదులుకుంటారా? లేదా? అన్న దానిపై ప్రియాంక గాంధీ నిర్ణయం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయమై తాను డైలమాను ఎదుర్కొంటున్నానని రాహుల్ గాంధీ బుధవారం మీడియాతో అన్నారు. అయితే, తన నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలకు సంతోషాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు. 

జాతీయ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు ఉన్న ప్రాధాన్యత రీత్యా రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాయ్‌బరేలీ సీటును వదులుకోవద్దని అమేథీ కాంగ్రెస్ ఎంపీ కిషోరీ లాల్ శర్మ ఇప్పటికే రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. రాహుల్ వయనాడ్‌ను వదులుకోవచ్చని కేరళ కాంగ్రెస్ చీఫ్ సుధాకరన్ కూడా సంకేతాలిచ్చారు.
Priyanka Gandhi
Wayanad
Rahul Gandhi
Congress
Bypoll

More Telugu News