Brawl in Italian Parliament: ఇటలీ పార్లమెంటులో కలబడి కొట్టుకున్న ఎంపీలు.. వీడియో ఇదిగో!
- పార్లమెంటులో బిల్లుపై రగడ, అధికార ప్రతిపక్ష నేతల పరస్పర దాడులు
- ఇటలీలో కొన్ని ప్రాంతాలకు మరింత ఆర్థిక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై వివాదం
- బిల్లును పార్లమెంటు ముందుకు తెచ్చిన అధికార పార్టీ, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
- దేశంలో ఉత్తర - దక్షిణ విభజనను ఈ బిల్లు మరింత తీవ్రం చేస్తుందని ఆందోళన
ఇటలీ పార్లమెంటులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ బిల్లు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన ఎంపీలు చట్టసభల గౌరవాన్ని మరిచి తన్నుకోవడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది. ప్రజల నుంచి సేకరించిన పన్నుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛను ఇచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. దీన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో సెంటర్ - లెఫ్ట్ ఫైవ్ స్టార్ మూవ్మెంట్ ఉద్యమానికి చెందిన ఓ చట్టసభ సభ్యుడు పార్లమెంటులో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించే ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ముష్టిఘాతాలు, తోపులాట జరిగింది. ఈ బిల్లు కారణంగా ఇటలీలో ఉత్తర - దక్షిణ విభజన మరింత తీవ్రమవుతుందని, పేదరికంలో మగ్గుతున్న దక్షిణాది ప్రాంతాలు మరింత ఇబ్బందుల్లో పడతాయని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు.
జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాధినేతలు ఇటలీకి చేరుకుంటున్న సమయంలోనే నేతలు ఇలా విచక్షణ, హుందాతనం మరిచి పరస్పరం దాడులకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై ఇటలీ విదేశాంగ మంత్రి విచారం వ్యక్తం చేశారు. తనకు మాట రావట్లేదని అన్నారు. ఇక గురువారం నుంచి శనివారం వరకూ జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు యూరోపియన్ యూనియన్, మరో ఆరు దేశాల నేతలు ఇటలీ చేరుకుంటున్నారు. ప్రధాని మోదీ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు.