Matthew Miller: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా చేతిలో పాక్ పరాజయంపై అమెరికా అధికారి జోక్!
- టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై పసికూన అమెరికా గెలుపు
- పాక్ జట్టును సూపర్ ఓవర్లో మట్టికరిపించిన యూఎస్
- ఎంతో బలమైన జట్టు ఇలా పసికూన చేతిలో ఓడిపోవడంతో అందరూ షాక్
- ఇదే విషయమై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌కు విలేకరుల ప్రశ్న
- తనదైన శైలిలో చమత్కరించిన మాథ్యూ మిల్లర్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచులో పాకిస్థాన్‌పై పసికూన అమెరికా గెలుపు పెను సంచలనం అనే చెప్పాలి. ఎందుకంటే బలమైన పేస్, బ్యాటింగ్ లైనప్ ఉన్న పాక్ జట్టును సూపర్ ఓవర్లో యూఎస్ మట్టికరిపించింది. ఇలా క్రికెట్లో ఎంతో బలమైన జట్టు, ఇప్పుడిప్పుడు క్రికెట్ నేర్చుకుంటున్న అమెరికా చేతిలో పరాజయం పొందడం అనేది అందిరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే విషయంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విలేకరుల సమావేశంలో తనదైన శైలిలో చమత్కరించారు.
పాకిస్థాన్ క్రికెట్ టీం ఆర్మీతో శిక్షణ తీసుకుంది, అమెరికా చేతిలో ఓడిపోయింది. దీని గురించి మీరు ఏం అనుకుంటున్నారని ఓ విలేకరి మాథ్యు మిల్లర్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన ఇలా స్పందించారు. ‘‘నాకు నైపుణ్యం ఉన్న ప్రాంతానికి మించిన విషయాలపై వ్యాఖ్యానించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను తరుచుగా ఇబ్బందుల్లో పడతాను. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కచ్చితంగా ఆ దశలో ఉంటుందని నేను చెబుతాను’’ అని మిల్లర్ అన్నారు. బహుశా క్రికెట్ ఆటలో పాకిస్థాన్‌కు అనుభం లేదేమో అని ఆయన అన్నారు. నాకు అనుభవం లేని విషయాల్లో కామెంట్ చేయడం కష్టంగా మారుతుందని, బహుశా పాకిస్థాన్ జట్టు కూడా ఆ దశలో ఉందేమో అని ఆయన పేర్కొన్నారు.
ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్, అమెరికా మ్యాచ్ హైలెట్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అమెరికా 20 ఓవర్లలో 159 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్లో అమెరికా 18 పరుగులు చేయగా.. పాక్ మాత్రం 13 పరుగులకే పరిమితం కావడంతో 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు సొంతదేశంలో పాక్ టీంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
అలాగే టీమిండియా చేతిలో కూడా పాకిస్థాన్ ఓడిపోవడంతో ఆ జట్టుపై ట్రోల్స్ ఇంకా పెరిగిపోయాయి. 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక, భారత బౌలర్ల దెబ్బకు పాక్ బ్యాటర్లు చతికిలపడ్డారు. ఇక ఆన్లైన్లో అయితే మీమ్స్‌తో చెలరేగిపోయారు. బాబర్ బృందాన్ని తమ కామెంట్లతో ఆటాడుకున్నారు.
ప్రస్తుతం సూపర్-8కి అర్హత సాధించేందుకు ఆదివారం ఐర్లాండ్‌తో పాకిస్థాన్ తలపడబోతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే భారత జట్టు సూపర్-8కి అర్హత సాధించింది. ప్రస్తుతం గ్రూప్-ఏలో ఇండియా, అమెరికా జట్లు టాప్‌లో ఉన్నాయి. ఇక మూడో స్థానంలో పాకిస్థాన్ ఉంది.