T20 World Cup: ఫ్లోరిడాలో భారీ వర్షాలు.. ఎమర్జెన్సీ ప్రకటన.. పాక్ సూపర్-8 ఆశలపై నీళ్లు!
- టీ20 ప్రపంచకప్ మ్యాచులకు ఫ్లోరిడా, డల్లాస్, న్యూయార్క్ నగరాలు ఆతిథ్యం
- ఇప్పటికే న్యూయార్క్‌లో మ్యాచ్‌లు పూర్తి
- ఈ వారం కీలక మ్యాచ్‌లు జరగనున్న ఫ్లోరిడాలో భారీ వరదల కారణంగా ఎమర్జెన్సీ ప్రకటన
టీ20 ప్రపంచకప్ మ్యాచులకు అమెరికాలోని మూడు నగరాలు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే న్యూయార్క్‌లో మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇక ఫ్లోరిడా(ఫోర్ట్ లాడర్డేల్), డల్లాస్‌లో మ్యాచ్‌లు మిగిలున్నాయి. అయితే ఈ వారం కీలక మ్యాచ్‌లు జరగనున్న ఫ్లోరిడా, ఫోర్ట్ లాడర్డేల్లో భారీ వరదల కారణంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో స్థానిక అధికారులు సౌత్ ఫ్లోరిడా విమానాశ్రయాలకు వందలాది విమానాలను క్యాన్సిల్ చేశారు.
పాకిస్థాన్ సూపర్-8 ఆశలపై నీళ్లు..
ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ పాకిస్థాన్ సూపర్-8 అవకాశాలకు గండికొట్టింది. ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు టీమిండియా అర్హత సాధించింది. రెండో స్థానం కోసం ఆతిథ్య అమెరికా, పాకిస్థాన్ పోటీ పడుతున్నాయి. ఫోర్ట్ లాడర్డేల్లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్కులో జూన్ 14న ఐర్లాండ్‌తో యూఎస్, 16న పాక్ తలపడతాయి.
అమెరికా, ఐర్లాండ్‌ను ఓడించినా లేదా వర్షంతో మ్యాచ్ రద్దు అయినా సరే యూఎస్ సూపర్- 8కి దూసుకెళుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే, ఆదివారం ఐర్లాండ్‌పై పాక్ గెలిచిననా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. అదే ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోతే మాత్రం ఆదివారం పాకిస్థాన్‌కు అవకాశం ఉంటుంది.
కాగా, యూఎస్ 3 మ్యాచుల్లో 2 గెలిచి నాలుగు పాయింట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది. కానీ వారి నెట్ రన్ రేట్ +0.127గా ఉంది. ఇక పాక్ నెట్ రన్ రేట్ (+0.191) నెట్ రన్ రేట్ అమెరికా కంటే మెరుగ్గా ఉంది. ఇది వారికి కలిసొచ్చే అంశం. అంటే పాక్, ఐర్లాండ్‌ను స్వల్ప తేడాతో ఓడించినా సరిపోతుంది. సూపర్-8కి క్వాలిఫై అవుతుంది. కానీ, ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ ప్రకటనతో ఇప్పుడు మ్యాచ్‌లు జరగడంపై అనుమానం వ్యక్తమవుతోంది. అదే జరిగితే పాక్ ఇంటిదారి పట్టక తప్పదు.
ఫోర్ట్ లాడర్డేల్లో చిక్కుకుపోయిన శ్రీలంక జట్టు..
ఇక టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న శ్రీలంక జట్టు భారీ వరదల కారణంగా ఫోర్ట్ లాడర్డేల్లో చిక్కుకుపోయింది. ఇప్పటికే ఇదే వేదికగా జూన్ 12న నేపాల్‌తో శ్రీలంక ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక శ్రీలంక జట్టు బుధవారం ఫోర్ట్ లాడర్డేల్ నుంచి కరేబియన్ దీవులకు వెళ్లాల్సి ఉంది. కానీ భారీ వర్షం, వరదలతో అక్కడే చిక్కుకుపోయింది. శ్రీలంక తమ ఫైనల్ గ్రూప్ మ్యాచ్‌ను 17న సెయింట్ లూసియాలో నెదర్లాండ్స్ తో ఆడాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో రెండు ఓడిపోయింది. ఒకటి వర్షార్పణం అయింది.