Komatireddy Venkat Reddy: తెలంగాణ వచ్చి పదేళ్లయినప్పటికీ... అసలైన రాష్ట్రం మాత్రం డిసెంబర్ 3న వచ్చింది: మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy Venkat Reddy comments on Telangana

  • తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య
  • ప్రైవేటు స్కూళ్లు మూసేసి... ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవాలనేది తమ నినాదమన్న మంత్రి
  • రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును ప్రారంభించుకుందామన్న మంత్రి

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లయిందని... కానీ అసలైన తెలంగాణ మాత్రం డిసెంబర్ 3న తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రానున్న నాలుగున్నరేళ్లలో తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పంప్ హౌస్, ప్రాజెక్టు రిజర్వాయర్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రైవేటు స్కూళ్లను మూసివేసి... ప్రభుత్వ పాఠశాలలన్నీ తెరుచుకోవాలనేది తమ ప్రభుత్వ నినాదం అన్నారు. విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యావ్యవస్థను పటిష్ఠపరచడమే తమ ప్రభుత్వం ధ్యేయమన్నారు. వచ్చే మూడేళ్లలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తామన్నారు. అనురాగ్, గురునానక్ యూనివర్సిటీల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద కలలు కని సాకారం చేసుకోవాలన్నారు.

రానున్న నాలుగు నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్‌ను ప్రారంభించుకుందామన్నారు. డిసెంబర్ లోపు ఈ ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నింపుతామని హామీ ఇచ్చారు. ఇక్కడి చెరువు వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. నార్కట్‌పల్లి డిపోకు మరో వారం రోజుల్లో ఇరవై కొత్త బస్సులు రాబోతున్నాయని చెప్పారు. మూడు నాలుగేళ్లలో మూసీ నదిని సుందరీకరిస్తామన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, విద్య గురించి కేసీఆర్ తన పాలనలో ఏ రోజూ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూశారన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమన్నారు.

  • Loading...

More Telugu News