Payyavula Keshav: జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నా: మంత్రి పయ్యావుల
- ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు
- ప్రతి పక్ష హోదా దక్కని వైనం
- సభ అర్థవంతంగా జరగాలని కోరుకుంటున్నామన్న పయ్యావుల
ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే రావడంతో, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఇదే విషయమై సందేహం వ్యక్తం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో, మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. సభ అర్థవంతంగా జరగాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తామని అన్నారు. సంపద సృష్టి పేరుతో పన్నులు వేయబోమని పయ్యావుల స్పష్టం చేశారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ను ఉపయోగించుకుని రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకువస్తామని చెప్పారు.
రాష్ట్ర ఖజానా ఎలా ఉందో చూడాల్సి ఉందని పయ్యావుల తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధుల మళ్లింపు, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టుపెట్టి అప్పులు తీసుకువరావడం వంటి అవకతవకలు చూశామని అన్నారు. ఆ మేరకు కాగ్ కూడా నివేదిక ఇచ్చిందని వెల్లడించారు.