Krishna District: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

6 dead in road accident in Krishna district

  • ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి వెనకవైపు ఢీకొట్టి రోడ్డు మధ్యలో ఆగిన మినీ వ్యాను
  • అదే సమయంలో అటునుంచి వేగంగా దూసుకొచ్చి వ్యాన్‌ను ఢీకొట్టిన కంటెయినర్ లారీ
  • ఐదుగురు అక్కడికక్కడే మృతి
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు కన్నుమూత
  • మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు వైపు నుంచి డ్రైవర్ సహా పదిమంది కూలీలు బంటుమిల్లి మండలం తుమ్మడిలో చేపల ప్యాకింగ్ కోసం మినీ వ్యాన్‌లో గురువారం రాత్రి 1.30 గంటలకు బయలుదేరారు.  తెల్లవారుజామున నాలుగైదు గంటలకు శీతనపల్లి వద్ద ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి వెనకవైపు ఢీకొట్టి అదే వేగంతో ముందుకెళ్లి రోడ్డు మధ్యలో వ్యాన్ ఆగిపోయింది. అదే సమయంలో అటువైపు వేగంగా వస్తున్న కంటెయినర్ లారీ మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ, వ్యాన్ నుజ్జునుజ్జు అయ్యాయి.

ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. గాయపడిన వారిని మచిలీపట్టణం సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితులను మంత్రి కొల్లు రవీంద్ర, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కాగా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరో ఆరుగురు మృతి చెందారు.

  • Loading...

More Telugu News