Narendra Modi: ఎన్డీయే కీలక భాగస్వామి నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

Prashant Kishor said that Nitish Kumar brought shame to Bihar when he touched the feet of PM Modi

  • ప్రధాని మోదీ పాదాలను తాకి బీహార్‌ను అవమానించారన్న ఎన్నికల వ్యూహకర్త
  • రాష్ట్రానికి నాయకుడంటే ప్రజల గౌరవానికి ప్రతీక అని వ్యాఖ్య
  • గతవారం జరిగిన ఎన్డీయే పార్టీల సమావేశాన్ని ఉద్దేశించి విమర్శలు

బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకి బీహార్‌ను అవమానించారని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగేందుకు మోదీ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి నాయకుడంటే ప్రజల గౌరవానికి ప్రతీక అని, కానీ నితీశ్ రాష్ట్రాన్ని అవమానానికి గురిచేశారని విమర్శించారు. గత వారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే పార్టీల సమావేశంలో మోదీ పాదాలను తాకేందుకు నితీశ్ చేసిన ప్రయత్నాన్ని ఉద్దేశించి పీకే ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో 'జన్ సురాజ్' ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రశాంత్ కిశోర్ శుక్రవారం భాగల్పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

గతంలో నితీష్ కుమార్‌తో కలిసి పనిచేసిన మీరు ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారంటూ జనాలు తనను ప్రశ్నిస్తుంటారని, అయితే నితీశ్ అప్పుడు వేరే వ్యక్తి అని ప్రశాంత్ కిశోర్ అన్నారు. నితీశ్ అప్పుడు తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదని వ్యాఖ్యానించారు. కాగా 2015లో ఎన్నికల సమయంలో జేడీయూకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత రెండేళ్లకు జేడీయూ పార్టీలో కూడా చేరారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్లారు.

కాగా లోక్‌సభ ఎన్నికల్లో నితీశ్ కుమార్‌ సారధ్యంలోని జేడీయూ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుచుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిన బీజేపీకి టీడీపీ తర్వాత రెండవ అతిపెద్ద మిత్రపక్షంగా జేడీయూ అవతరించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News