Elon Musk on EVMs: ఎన్నికల్లో ఈవీఎంలను వాడొద్దు.. ఎలాన్ మస్క్ కీలక సూచన
- ప్యూర్టో రికో ఎన్నికల్లో బయటపడ్డ ఈవీఎం అవకతవకలు
- ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం తక్కువే అయినా వీటిని వాడొద్దన్న మస్క్
- భారత్‌లో హ్యాకింగ్‌కు సాధ్యంకాని మూడో తరం ఎమ్3 ఈవీఎంల వినియోగం
- టాంపరింగ్‌కు ప్రయత్నిస్తే ఆటోమేటిక్‌గా నిరుపయోగంగా మారిపోయే ఎమ్3 ఈవీఎంలు
ఎన్నికల్లో ఈవీఎంల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు) వినియోగాన్ని పక్కనపెట్టాలని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ సూచించారు. ఈవీఎంలు హ్యాకింగ్ బారిన పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్యూర్టో రికో దేశంలో ఈవీఎంల అవకతవకలు బయటపడిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు ట్వీట్ చేశాడు. ‘‘మనం ఎన్నికల్లో ఈవీఎంలను అస్సలు వాడకూడదు. వీటిని ఏఐ లేదా మనుషులు హ్యాక్ చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నా ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దీన్ని తీవ్రమైన ప్రమాదంగా పరిగణించాలి’’ అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఇటీవల ప్యూర్టో రికోలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించి అనేక అవకతవకలు వెలుగు చూశాయి. అయితే, ఈవీఎంలకు అనుసంధానంగా ఓటు స్లీప్పులు కూడా ఉండటంతో తప్పు ఎక్కడ జరిగిందో అధికారులు వెంటనే గుర్తించిన అధికారులు ఓట్ల లెక్కింపును పక్కాగా చేపట్టగలిగారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అమెరికా దివంగత మాజీ అధ్యక్షుడు కెన్నడీ బంధువు రాబర్ట్ కెన్నెడీ ఒకరు చేసిన పోస్టును మస్క్ పంచుకున్నారు. ఓటు స్లిప్పులు లేని సందర్భాల్లో పరిస్థితి ఏమిటని రాబర్ట్ తన ట్వీట్‌లో ప్రశ్నించారు. ఈవీఎంలతో ప్రమాదాలకు సంబంధించిన ఓ అధ్యయనాన్ని కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమెరికాలో కూడా ఈవీఎంలపై మక్కువ వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, భారత్‌లో అనుభవాలు మాత్రం ఈవీఎంల భద్రతపై నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. టాంపరింగ్‌కు అవకాశాం లేని మూడో తరం ఎమ్3 ఈవీఎంలను భారత్ వినియోగిస్తోంది. టాంపరింగ్ లేదా హ్యాకింగ్ ప్రయత్నం జరిగితే ఇవి తమంతట తాముగా సేఫ్టీ మోడ్‌లోకి వెళ్లి నిరుపయోగంగా మారిపోతాయి.
భారత్‌లోని ఈవీఎంలను ఆధునికీకరించడంలో ఐఐటీలు కీలక పాత్ర పోషించాయి. ఎన్నికల కమిషన్‌కు చెందిన టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీ కూడా ఈవీఎం భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. భారత్‌లోని ఈవీఎంలు ఇతర దేశాల్లోని వాటికంటే చాలా భిన్నమైనవని ఐఐటీ బాంబే ప్రొఫెసర్ దినేశ్ కే శర్మ పేర్కొన్నారు. ఎమ్3 ఈవీలకు ఇతర డివైజ్‌లతో ఎటువంటి కనెక్షన్ ఉండదని, వాటికి కనీసం విద్యుత్ కనెక్షన్ కూడా ఉండదని అన్నారు. ఈవీఎంల సమగ్రత, భద్రతను వీవీపాట్ యంత్రాల వినియోగం పెంచిందని కూడా సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది.