Road Accident: అదుపుతప్పి లోయలో పడ్డ మినీ బస్సు.. 14 మంది దుర్మరణం

14 Dead As Tempo Traveller With 26 People Falls Into Gorge In Uttarakhand

  • ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
  • రిషికేశ్- బద్రినాథ్ హైవేపై అలకనందా నది ఒడ్డున దారుణం
  • తీవ్రంగా గాయపడ్డ మరో 12 మంది టూరిస్టులు

దేవభూమి ఉత్తరాఖండ్ లోని పర్యాటక ప్రాంతాలను చూసొద్దామని బయలుదేరిన టూరిస్టులు రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపుతప్పి హైవే పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దాదాపు 1500 అడుగుల పైనుంచి పడడంతో బస్సు నుజ్జునుజ్జుగా మారింది. అందులోని 26 మంది టూరిస్టుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రుద్రప్రయాగ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుందీ దారుణం.

ఢిల్లీకి చెందిన 26 మంది టూరిస్టులు ఓ మినీ బస్సులో ఉత్తరాఖండ్ యాత్రకు బయలుదేరారు. శనివారం రుద్రప్రయాగ్ జిల్లా చేరుకున్నారు. రిషికేశ్-బద్రినాథ్ హైవేపై అలకనందా నది పక్క నుంచి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మినీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వారిని ఢీ కొడుతూ అలకనందా నదిలో పడిపోయింది. చాలా ఎత్తు నుంచి పడడంతో మినీ బస్సు దారుణంగా దెబ్బతింది. లోపల ఉన్న టూరిస్టుల్లో 10 మంది అక్కడికక్కడే చనిపోగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరో నలుగురు కన్నుమూశారు. 

మిగతా 12 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారికి రిషికేశ్ ఎయిమ్స్ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద ప్రధాని మోదీ రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు అందించాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News