Delhi Water Crisis: ఢిల్లీలో ముదిరిన నీటి సంక్షోభం... జల్ బోర్డు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి

BJP workers attacked on Jal Board Office in Delhi

  • ఢిల్లీలో తీవ్రస్థాయిలో నీటి ఎద్దడి
  • జల్ బోర్డు వద్ద బీజేపీ కార్యకర్తల నిరసన
  • ఖాళీ కుండలతో దాడి
  • జల్ బోర్డు కార్యాయంలో కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం

దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ట్యాంకర్లతో నీటిని తీసుకువస్తున్నా, ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోని పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో నీటి సంక్షోభంపై బీజేపీ కార్యకర్తలు జల్ బోర్డు వద్ద ఖాళీ కుండలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆప్ ప్రభుత్వ తీరు పట్ల వారు మండిపడుతున్నారు. 

జల్ బోర్డు వద్దకు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఓ దశలో బీజేపీ కార్యకర్తలు జల్ బోర్డు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కుండలు విసరడంతో కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయి.

దీనిపై బీజేపీ నేత రమేశ్ బిధూరీ స్పందిస్తూ... ప్రజల్లో ఆగ్రహం నెలకొన్నప్పుడు వారు ఏమైనా చేస్తారని వ్యాఖ్యానించారు. జల్ బోర్డు ప్రభుత్వ ఆస్తి మాత్రమే కాదు... ప్రజల ఆస్తి కూడా... ప్రజా ఆస్తులను ధ్వంసం చేయొద్దు అని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

బీజేపీ నిరసనలపై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరా పైపులను ధ్వంసం చేసింది ఎవరు? ఎవరి కుట్ర ఇది? అంటూ బీజేపీపై మండిపడ్డారు.

  • Loading...

More Telugu News