Rishikonda Palace: రుషికొండ ప్యాలెస్ లోపల ఎలా ఉందో చూశారా... వీడియో ఇదిగో!
- గత ప్రభుత్వ హయాంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణం
- నేడు టీడీపీ నేతల చొరవతో విజువల్స్ బహిర్గతం
- ప్యాలెస్ లోకి వెళ్లి పరిశీలించిన గంటా శ్రీనివాసరావు
- ప్యాలెస్ లో సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయిన మీడియా ప్రతినిధులు
గత ప్రభుత్వ హయాంలో విశాఖలోని రుషికొండపై తవ్వకాలు చేపట్టి నిర్మించిన రాజభవనం విజువల్స్ ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. గతంలో ఎవరినీ ఆ భవనం వద్దకు అనుమతించకపోగా, ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో, స్థానిక ప్రజాప్రతినిధి గంటా శ్రీనివాసరావు మీడియాతో కలిసి రుషికొండ ప్యాలెస్ లో అడుగుపెట్టారు. లోపల కనిపించిన దృశ్యాలు వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఇప్పుడు యూట్యూబ్ లోనూ, సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా ఈ ప్యాలెస్ కు చెందిన వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఖరీదైన ఫ్లోరింగ్, వియత్నాం గ్రానైట్ స్టోన్, ఇటలీ మార్బుల్స్, విలాసవంతమైన షాండ్లియర్ లైటింగ్, లక్షల విలువ చేసే బాత్ టబ్ లు, ఓ సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ సైజులో ఉన్న బాత్రూంలు, డిజైనర్ ఫ్యాన్లు, ఏసీలు, డైనింగ్ హాలు, ఓపెన్ కిచెన్ విశాలమైన కాన్ఫరెన్స్ హాలుతో ఈ ప్యాలెస్ ఔరా అనిపిస్తోంది.
మాస్టర్ బెడ్ రూం కంటే బాత్రూం పెద్దదిగా ఉందంటే ఏ రేంజిలో దీన్ని నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. రూ.500 కోట్లతో నిర్మించారంటూ గతంలో వార్తలు వచ్చినా, ఇప్పుడా భవనం అడుగడుగునా ఉట్టిపడుతున్న లగ్జరీ చూస్తే భారీగానే ఖర్చుపెట్టారని తెలుస్తుంది.
బీచ్ కు ఎదురుగా ఉన్న ఈ భవన సముదాయంలో ఇందులో మొత్తం ఏడు బ్లాకులు ఉన్నాయి. ప్రతి బ్లాకు ముందు అందంగా తీర్చిదిద్దిన గార్డెన్లు దర్శనమిస్తున్నాయి. టీడీపీ నేతల చొరవతో రుషికొండ భవనం లోపల ఏముందన్నది వెలుగులోకి వచ్చింది.