Sasikala: సరైన సమయం వచ్చింది.. నా రీఎంట్రీ మొదలైంది: శశికళ సంచలన ప్రకటన

VK Sasikala said that her entry has begun for Reentry in Politics and Vows to Amma rule by winning the 2026 Assembly polls

  • అన్నాడీఎంకేలోకి తన రీఎంట్రీకి సంపూర్ణ సమయం వచ్చిందన్న శశికళ 
  • 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తానని వ్యాఖ్య
  • ఇకపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వెల్లడి 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ ఆదివారం కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సరైన సమయం ఆసన్నమైందని, పార్టీలోకి తన పున:ప్రవేశం మొదలైందని ఆమె అన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐఏడీఎంకే పతనం అవుతుందని భావించాల్సిన అవసరం లేదని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అమ్మ పాలనను తీసుకొస్తానని శిశికళ శపథం చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్నలు అడగడంలేదని, ఇకపై ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తానని ఆమె అన్నారు. ఈ మేరకు ఆదివారం తన మద్దతుదారులతో జరిగిన కార్యక్రమంలో శశికళ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘నేను మీకు చెబుతున్న సమయం వచ్చింది. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. తమిళనాడు ప్రజలు మన వైపే ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నారు. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను. అన్నాడీఎంకే కథ ముగిసిందని అనుకోవద్దు. నా రీ-ఎంట్రీ ప్రారంభమైంది’’ అని ఆమె అన్నారు. పార్టీని ఏకీకృతం చేయాలనే తన వైఖరిని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. 

పార్టీలోకి కుల ఆధారిత రాజకీయాలు ప్రవేశించాయని శశికళ అన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్, 'అమ్మ జయలలిత' నడిపించిన పార్టీలో ఇలాంటి కుల రాజకీయాలను ప్రోత్సహించడాన్ని పార్టీ కార్యకర్తలు సహించరని ఆమె వ్యాఖ్యానించారు. జయలలిత కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసి ఉంటే 2017లో పళనిస్వామి సీఎం అయ్యి ఉండేవారు కాదని అన్నారు. ఇక త్వరలో తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నానని, ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నానని, డీఎంకే ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సి ఉందని ఆమె అన్నారు. కాగా పళనిస్వామి సారధ్యంలోని అన్నాడీఎంకే పార్టీపై పట్టు సాధించేందుకు శశికళ గతంలో చాలా సార్లు ప్రయత్నించారు. కానీ ఆమె చేసిన ప్రయత్నాలకు పళనిస్వామి చెక్ పెట్టారు.

  • Loading...

More Telugu News