Bakrid 2024 Wishes: ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్, వైఎస్ జగన్
- 'ఎక్స్' వేదికగా బక్రీద్ విషెస్ తెలిపిన చంద్రబాబు, లోకేశ్, వైఎస్ జగన్
- అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశమంటూ బాబు ట్వీట్
- ఇస్లాంలో త్యాగం, దానగుణాలకు ప్రత్యేకమైన స్థానముందంటూ లోకేశ్ ట్వీట్
- కరుణ, త్యాగం, భక్తి విశ్వాసాలకు ప్రతీక బక్రీద్ అంటూ జగన్ ట్వీట్
త్యాగ నిరతికి, అల్లాహ్‌పై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగ (ఈద్ ఉల్ ఆదా)ను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యాదర్శి, మంత్రి నారా లోకేశ్, మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
"స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశం. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
"సమాజంలో త్యాగనిరతిని పెంపొందించే బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. ఇస్లాంలో త్యాగం, దానగుణాలకు ప్రత్యేకమైన స్థానముంది. ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ ఈద్ అల్ అదా (బక్రీద్) సమాన భావన పెంపొందిస్తుంది" అని లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
"కరుణ, త్యాగం, భక్తి విశ్వాసాలకు ప్రతీక బక్రీద్. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు" అంటూ జగన్ ట్వీట్ చేశారు.