Joe Biden: స్టేజీపై కొన్ని క్షణాలపాటు ఫ్రీజ్ అయిపోయిన బైడెన్.. చెయ్యి పట్టి జాగ్రత్తగా తీసుకెళ్లిన ఒబామా.. వీడియో ఇదిగో!
- లాస్ ఏంజెలెస్‌లో ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్
- హాజరైన హాలీవుడ్ ప్రముఖులు
- రికార్డు స్థాయిలో 30 మిలియన్ డాలర్లకుపైనే వసూలు
- కిమ్మెల్‌తో ఇంటర్వ్యూ తర్వాత 10 సెకన్లపాటు చలనం లేకుండా విగ్రహంలా నిలబడిన బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్టేజిపై కొన్ని క్షణాల పాటు ఫ్రీజ్ అయిపోయారు. చలనం లేకుండా నిల్చున్న ఆయనను చూసిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వెంటనే ఆయన చెయ్యి పట్టుకుని నడిపించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. శనివారం లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పీకాక్ థియేటర్‌లో అర్ధరాత్రి జిమ్మీ కిమ్మెల్‌తో 45 నిమిషాలపాటు సరదాగా సాగిన ఇంటర్వ్యూ తర్వాత ఈ ఇబ్బందికర ఘటన కెమెరాలకు చిక్కింది. సభికులకు బైడెన్, ఒబామా అభివాదం చేసిన తర్వాత బైడెన్ దాదాపు 10 సెకన్లపాటు విగ్రహంలా నిల్చుండిపోయారు. ఆయనలో చలనం లేకపోవడాన్ని గమనించిన ఒబామా చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి హుందాగా నడిపించుకుని తీసుకెళ్లారు.
ఈ వీడియో చూసిన వారు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. బైడెన్ మరోమారు ఎన్నికలకు సిద్ధపడడంపై విమర్శలు చేస్తున్నారు. అమెరికాలోనే అత్యంత వృద్ధ అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతవారం ఇటలీలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో బైడెన్ ప్రపంచ దేశాల నేతలకు దూరంగా కనిపించారు.
బైడెన్ తాజా ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ విజయవంతమైంది. రికార్డు స్థాయిలో 30 మిలియన్ డాలర్లకుపైనే సమకూరాయి. దీనికి జార్గ్ క్లూనీ, జులియా రాబర్ట్స్, బార్బా స్ట్రీశాండ్ వంటి హాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. కాగా, కిమ్మెల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో బైడెన్, ఒబామా మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్‌ను అధికారానికి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.