Harish Rao: గ్రూప్స్ అభ్య‌ర్థులకు న్యాయం చేయాలి.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ యువ‌త‌ను రెచ్చ‌గొట్టింది: హ‌రీశ్‌రావు

Harish Rao Press Meet on Groups Posts

  • గ్రూప్స్ పోస్టులు పెంచాల‌ని అడిగితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎందుకు స్పందించ‌డం లేదంటూ ఫైర్‌
  • గ్రూప్‌-1, 2 మెయిన్స్ ప‌రీక్ష‌కు 1:100 చొప్పున అనుమ‌తి ఇవ్వాల‌ని అభ్య‌ర్థులు కోరుతున్నారని వ్యాఖ్య‌
  • గ్రూప్స్ ప‌రీక్ష‌లకు మ‌ధ్య వ్య‌వ‌ధి ఉండాల‌ని అభ్య‌ర్థులు కోరుతున్నార‌న్న హ‌రీశ్‌రావు

గ్రూప్స్ అభ్య‌ర్థులు వ‌చ్చి పోస్టులు పెంచాల‌ని అడిగితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎందుకు స్పందించ‌డం లేద‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత‌ హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. సోమ‌వారం మీడియా స‌మావేశంలో హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. గ్రూప్స్ అభ్య‌ర్థులు తాజాగా బీఆర్ఎస్ కార్యాల‌యానికి వ‌చ్చి ఈ విష‌య‌మై త‌మ వ‌ద్ద మొర పెట్టుకున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. గ్రూప్‌-1, 2 మెయిన్స్ ప‌రీక్ష‌కు 1:100 చొప్పున అనుమ‌తి ఇవ్వాల‌ని అభ్య‌ర్థులు కోరుతున్నారని తెలిపారు. 

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు 1:100 ఇవ్వాల‌ని యువ‌త‌ను రెచ్చ‌గొట్టిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ఎందుకు గ్రూప్స్ మెయిన్స్‌కు 1:100 ఇవ్వ‌డం లేద‌ని నిల‌దీశారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు గ్రూప్స్ పోస్టులు పెంచాల‌ని అడిగిన వారు.. ఇప్పుడు ఇదే విష‌య‌మై విద్యార్థులు వెళ్లి అడిగితే ఎందుకు స్పందించ‌డం లేద‌ని ఆయ‌న ధ్వ‌జమెత్తారు.     

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాలంటూ అభ్య‌ర్థులు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చి కోరిన‌ట్లు హ‌రీశ్‌రావు వెల్ల‌డించారు. గ్రూప్స్ ప‌రీక్ష‌లకు మ‌ధ్య వ్య‌వ‌ధి ఉండాల‌ని అభ్య‌ర్థులు కోరుతున్న విష‌యాన్ని కూడా ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. జాబ్ క్యాలెండ‌ర్ గురించి ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌ల‌తో ఊద‌ర‌గొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఈ విష‌యంపై ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. అలాగే ఏడాదికి 2 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని కూడా మాటిచ్చార‌ని గుర్తు చేశారు. ఎన్నిక‌ల హామీలు నెర‌వేర్చ‌డంలో కాంగ్రెస్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని హ‌రీశ్‌రావు దుయ్య‌బ‌ట్టారు.

  • Loading...

More Telugu News