Tiger: నెల్లూరు-ముంబయి హైవేపై కారును ఢీకొట్టిన పెద్దపులి

Tiger collides with a speeding car on Nellore Mumbai highway
  • నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో పెద్దపులి సంచారం
  • బద్వేలు నుంచి నెల్లూరుకు వస్తున్న కారు
  • రోడ్డు దాటే ప్రయత్నంలో కారును ఢీకొట్టిన పులి
  • పెద్దపులిని కాస్త దూరం ఈడ్చుకెళ్లిన కారు
  • కాళ్లకు తీవ్ర గాయాలైనప్పటికీ అడవిలోకి పరుగులు తీసిన పులి
నెల్లూరు జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో తాజాగా పెద్దపులి దర్శనమిచ్చింది. నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఢీకొట్టింది. బద్వేలుకు చెందిన వ్యక్తులు కొందరు కారులో నెల్లూరు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 

రోడ్డును దాటే క్రమంలో పెద్దపులి అటుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారు... పెద్దపులిని కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. కాళ్లకు తీవ్ర గాయాలైనప్పటికీ ఆ పులి అడవిలోకి పరుగులు తీసిందని తెలిపారు. పెద్దపులి ఢీకొట్టిన ఘటనలో కారు ముందు భాగం ధ్వంసం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

ఈ ఘటన మర్రిపాడు మండలం పరిధిలో జరిగింది. పెద్దపులి సంచరిస్తోందన్న వార్తతో మర్రిపాడు మండల వాసులు హడలిపోతున్నారు. కారులోని ప్రయాణికులైతే వణికిపోయారు. డ్రైవర్ శ్రీనివాసులు బ్రేక్ వేయడంతో పెద్దపులి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. 

పెద్దపులి కారును ఢీకొట్టిన ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పెద్దపులి కోసం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపడతామని వెల్లడించారు.
Tiger
Car
Nellore-Mumbai Highway
Nellore District

More Telugu News