Pakistan: టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం.. పాక్ కు తిరిగి వెళ్లని బాబర్, మరో ఐదుగురు క్రికెటర్లు!
- లీగ్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్
- బాబర్ సేనపై అభిమానులు, మాజీల ఆగ్రహం
- ఈ నేపథ్యంలోనే స్వదేశానికి వెళ్లని ఆరుగురు పాక్ ప్లేయర్లు
- ఇమాద్ వసీం, అమీర్, షాదాబ్ ఖాన్, రవూఫ్, ఆజం ఖాన్ లండన్‌కు పయనం
టీ20 ప్రపంచకప్ 2024లో దాయాది పాకిస్థాన్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొని లీగ్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. దీంతో వీరు పాక్ అభిమానులు, మాజీల ఆగ్రహానికి గురికాక తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌తో పాటు మరో ఐదుగురు క్రికెటర్లు స్వదేశానికి వెళ్లలేదని సమాచారం. మిగతా స్క్వాడ్ మంగళవారం పాక్‌కు పయనమైంది.
వీరంతా అమెరికా నుంచి నేరుగా యూకే వెళ్లినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు అక్కడే ఉండి పాక్‌కు వెళ్తారట. వీరిలో ఇమాద్ వసీమ్, మహమ్మద్ అమీర్, షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్, ఆజం ఖాన్ లండన్ వెళ్లారని తెలిసింది. వీరిలో కొందరు అక్కడి స్థానిక లీగుల్లో ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే బాబర్ నేరుగా స్వదేశానికి వెళ్లకపోవడంపై ఆ జట్టు మాజీలు, అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ప్రపంచకప్‌లో ఓటమిపై సమీక్షించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఇక టీ20 వరల్డ్‌కప్‌లో తన చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆదివారం ఐర్లాండ్‌ను ఓడించి విజయంతో టోర్నీని ముగించింది. మొత్తంగా గ్రూప్-ఏలో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మొదటి రెండు స్థానాల్లో ఉన్న భారత్, అమెరికా సూపర్-8కి దూసుకెళ్లాయి.