Polavaram Project: చంద్రబాబు పోలవరంపై డబ్బులు సంపాదించాలని చూశారు: మాజీ మంత్రి అంబటి రాంబాబు
- నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
- జగన్ నిర్వాకం వల్లే పోలవరం నాశనం అయిందని విమర్శలు
- చంద్రబాబు పోలవరం ద్రోహి అంటూ అంబటి రాంబాబు ఫైర్
- ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితవు
జగన్ నిర్వాకం వల్లే పోలవరం నాశనం అయిందని సీఎం చంద్రబాబు నిన్న ప్రాజెక్టు సందర్శన అనంతరం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేడు మీడియా సమావేశం నిర్వహించారు.
జగన్ పోలవరం ద్రోహి అని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని, కానీ చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి అని విమర్శించారు. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఎందుకు పూర్తి చేయలేకపోయారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును అడ్డంపెట్టుకుని డబ్బులు సంపాదించాలని చూశారని, ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితవు పలికారు.
వాస్తవానికి జగన్ పాలనలోనే పోలవరం పనులు వేగంగా జరిగాయని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రజలకు నిజానిజాలు తెలియాలని, జగన్ హయాంలో పోలవరంలో ఎలాంటి తప్పిదాలు చోటుచేసుకోలేదని అన్నారు. ఎప్పుడైనా కాఫర్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టాకే డయాఫ్రం వాల్ నిర్మాణం జరపాలని, కానీ పోలవరంలో అందుకు భిన్నంగా జరిగిందని, ప్రాజెక్టుకు నష్టం వాటిల్లడానికి కారణం అదేనని అంబటి వివరించారు.
పోలవరంపై చంద్రబాబు చేతులెత్తేస్తే... వైసీపీ పాలనలోనే కాఫర్ డ్యామ్ లు, స్పిల్ వేల నిర్మాణాలు జరిపామని వివరించారు. పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబేనని విమర్శించారు.