Bihar: రూ.12 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం.. ప్రారంభానికి ముందే కుప్పకూలిన వైనం
- బీహార్లోని అరారియా జిల్లాలో బక్రా నదిపై వంతెన
- నదీ ప్రవాహం పెరగడంతో కూలిపోయిన కొంత భాగం
- నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే బ్రిడ్జి కూలిపోయిందని స్థానిక ఎమ్మెల్యే విమర్శ
బీహార్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అరారియా జిల్లాలో బక్రా నదిపై రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓ కాంక్రీట్ బ్రిడ్జి ప్రారంభించక ముందే కూలిపోయింది. నదీ ప్రవాహం పెరగడంతో కొంత భాగం కుప్పకూలింది. కూలిపోయిన భాగం నది మధ్యలో ఉండగా.. ఒడ్డున నిర్మించిన భాగం చెక్కుచెదరకుండా నిలబడింది.
నదిపై బ్రిడ్జి ఒక వైపునకు వంగి పోయిందనే సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లోనే బ్రిడ్జి విరిగిపోయి నీటిలో పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు తమ సెల్ఫోన్లలో బంధించారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.
కాగా కుర్సకాంత, సిక్తి ప్రాంతాల మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం ఈ బ్రిడ్జిని నిర్మించారు. కనీసం ప్రారంభోత్సవం కూడా కాకముందే బ్రిడ్జి కూలిపోవడంపై సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ విస్మయానికి గురయ్యారు. నిర్మాణ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ బ్రిడ్జి కూలిపోయిందని, విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.