Kiran: హర్యానాలో కాంగ్రెస్కు షాక్... మాజీ సీఎం కోడలు కిరణ్ చౌదరి రాజీనామా
- తోషమ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిరణ్ చౌదరి
- అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
- త్వరలో బీజేపీలో చేరనున్న కిరణ్ చౌదరి
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. భివానీ జిల్లా పరిధిలోని తోషమ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిరణ్ చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కిరణ్ చౌదరి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆమె కూతురు శ్రుతి కూడా కమలం పార్టీలో చేరనున్నారు. హర్యానా కాంగ్రెస్ నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో శ్రుతి ఒకరు.
కిరణ్ చౌదరి మాజీ సీఎం బన్సీలాల్ కోడలు. శ్రుతికి లోక్ సభ టిక్కెట్ నిరాకరించడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భివానీ - మహేంద్రగఢ్ పార్లమెంటరీ స్థానం తన కూతురు శ్రుతికి ఇవ్వాలని కిరణ్ చౌదరి పార్టీ పెద్దలను కోరారు. కానీ పార్టీ నిరాకరించింది. ఈ కారణంగానే ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు. కిరణ్ చౌదరి తన రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. హర్యానాలో అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.